The players
-
ఇదా క్రీడాభివృద్ధి ?
అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిరిగిన దుస్తులు.. ఒట్టి కాళ్లు! ఇది మన గ్రామీణ క్రీడాకారుల దుస్థితి. క్రీడాభివృద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూపుతూ అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ క్రీడా పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన అండర్–14, అండర్–17 విభాగాల్లో దాదాపు 1,200 మంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో అత్యధిక క్రీడాకారులకు సరైన దుస్తులు లేవు. కాళ్లకు షూ కూడా లేకుండా ఒట్టికాళ్లతోనే తమ క్రీడా ప్రతిభను చాటుకునేందుకు తపనపడ్డారు. కనీసం దాతలతోనైనా క్రీడాకారులకు షూ ఇప్పించే అవకాశమున్నా... ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించలేదు. ఇదే పరిస్థితి జాతీయ స్థాయిలోనూ పునరావృతమైతే... రాష్ట్రపరువు గంగలో కలిసినట్లేనంటూ పలువురు వ్యాఖ్యానించారు. -
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియంలు నిర్మించి, ప్రత్యేక నిపుణుల ద్వారా శిక్షణలు ఇస్తున్నామన్నారు. శుక్రవారం బాన్సువాడలోని కమ్యూనిటీ సెంటర్ వద్ద రూ. 2.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు శిక్షణ పొందేందుకు స్టేడియంలు ఉపకరిస్తాయన్నారు. బాన్సువాడలో దశాబ్దాలుగా మినీ స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఉందని, నిధులు మంజూరైనా, సరైన స్థలం లభించక ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం లభించిన స్థలం పట్టణ నడిబొడ్డులో ఉందని, దీనిని అందరూ చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఈ స్టేడియంలో టెన్నిస్, షటిల్ కోసం ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కీడ్రలు ఆడేవిధంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే స్టేడియం చుట్టూ వాకింగ్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 14 మడిగెలను నిర్మించి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీల కోసం బాన్సువాడలో రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ. 4.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బాన్సువాడలో రూ. 1.75 కోట్లతో పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్, గిరిజనుల కోసమే యూత్ ట్రైనింగ్ సెంటర్ మంజూరైందని, దీని కోసం రూ. 4.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీఏ అశోక్‌కుమార్, సర్పంచ్ వాణివిఠల్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయగంగాధర్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణం గెలిస్తే రూ.7 లక్షలు
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ క్రీడల్లో పతకాలు సాధించే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు భారీగా నగదు బహుమతులు ఇస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేరళలో 31 నుంచి జరిగే క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధిస్తే రూ.7 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్యానికి రూ.3 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని మంత్రి తెలిపారు. టీమ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన జట్లకు కూడా మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగ్గా నగదు ప్రోత్సాహకం ఇస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఏపీ తరఫున క్రీడల్లో పాల్గొం టున్న క్రీడాకారులకు దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఆయన కిట్లు అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరైన మౌళిక సదుపాయాలు లేకపోయినా... పతకాలు తెస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏపీ ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీ చైర్మన్ పవన్‌రెడ్డి, జాతీయ క్రీడల చెఫ్ డి మిషన్ తోట నరసింహం, రమణరావు, కేపీరావు, శాప్ వీసీ అండ్ ఎండీ చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
కర్నూలు(స్పోర్ట్స్): క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి అన్నారు. స్థానిక ఔట్ డోర్ స్టేడియంలో శనివారం కర్నూలు జోనల్ బాలుర ఫుట్‌బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. స్నేహ సంబంధాలు మెరుగు పడతాయన్నారు. క్రీడాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని విశిష్ట అతిథి జంపాల మధుసూధనరావు తెలిపారు. కర్నూలు నిర్వహక క్రీడల అధ్యక్ష, కార్యదర్శులు బి.నాగరాజు, కె.పరమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు వేణుగోపాల్, కె.వెంకటేశ్వర్లు, సి.వెంకటేశ్వర్లు, టి.క్రిష్ణ తదితరులు జీయర్ పాల్గొన్నారు. అండర్-14 విభాగంలో 8 జట్లు, అండర్-17 విభాగంలో 11 జట్లు పాల్గొంటున్నాయి. మొదటి రోజు విజేతలు వీరే... అండర్-17 విభాగంలో టౌన్ మోడల్ జట్టు సీఆర్ఆర్ ఎస్ఏపీ క్యాంపు జట్టుపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సిస్టర్ స్టాన్సిలాస్ జట్టు చిత్తారివీధి కేశవరెడ్డి జట్టుపై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. జెడ్పీ ఉల్చాల జట్టు నెహ్రూ మెమోరియల్ జట్టుపై 4-0 గోల్స్ తేడాతో, శ్రీలక్ష్మి పాఠశాల జట్టు కేశవరెడ్డి పాఠశాల(వీఆర్.కాలనీ) జట్టుపై 2-0 గోల్స్ తేడాతో, మాంటిస్సోరి ఏ క్యాంపు జట్టు లిటిల్ బర్డ్స్ జట్టుపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించాయి. అండర్-14 విభాగంలో సీఆర్ఆర్ ఎస్ఏపీ క్యాంపు జట్టు లిటిల్ బర్డ్స్ జట్టుపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. శ్రీలక్ష్మి హైస్కూల్ జట్టు మునిసిపల్ స్కూలు జట్టుపై 2-1 గోల్స్ తేడాతో, ఉల్చాల జెడ్పీ పాఠశాల జట్టు కేశవరెడ్డి చిత్తారి స్ట్రీట్ జట్టుపై 2-0 గోల్స్ తేడాతో, మాంటిస్సోరి ఏ క్యాంపు జట్టు టౌన్ మోడల్ జట్టుపై 2-0 గోల్స్ తేడాతో తమ ప్రత్యర్థుల జట్లపై విజయం సాధించాయి.