గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
-
జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలి
-
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ : తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లోనూ మినీ స్టేడియంలు నిర్మించి, ప్రత్యేక నిపుణుల ద్వారా శిక్షణలు ఇస్తున్నామన్నారు. శుక్రవారం బాన్సువాడలోని కమ్యూనిటీ సెంటర్ వద్ద రూ. 2.65 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు శిక్షణ పొందేందుకు స్టేడియంలు ఉపకరిస్తాయన్నారు. బాన్సువాడలో దశాబ్దాలుగా మినీ స్టేడియం నిర్మించాలనే డిమాండ్ ఉందని, నిధులు మంజూరైనా, సరైన స్థలం లభించక ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం లభించిన స్థలం పట్టణ నడిబొడ్డులో ఉందని, దీనిని అందరూ చక్కగా వినియోగించుకోవాలన్నారు. ఈ స్టేడియంలో టెన్నిస్, షటిల్ కోసం ఇండోర్ స్టేడియం, ఔట్‌డోర్ టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్టు, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కీడ్రలు ఆడేవిధంగా నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే స్టేడియం చుట్టూ వాకింగ్ కోసం ర్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 14 మడిగెలను నిర్మించి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్సీల కోసం బాన్సువాడలో రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ. 4.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. బాన్సువాడలో రూ. 1.75 కోట్లతో పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్, గిరిజనుల కోసమే యూత్ ట్రైనింగ్ సెంటర్ మంజూరైందని, దీని కోసం రూ. 4.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌డీఏ అశోక్‌కుమార్, సర్పంచ్ వాణివిఠల్, జెడ్పీటీసీ సభ్యుడు జంగం విజయగంగాధర్, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్ బాబా, ఏఎంసీ చైర్మన్ నార్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.