ఇదా క్రీడాభివృద్ధి ?
అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిరిగిన దుస్తులు.. ఒట్టి కాళ్లు! ఇది మన గ్రామీణ క్రీడాకారుల దుస్థితి. క్రీడాభివృద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూపుతూ అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు సోమవారం ముగిశాయి.
మూడు రోజుల పాటు సాగిన ఈ క్రీడా పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన అండర్–14, అండర్–17 విభాగాల్లో దాదాపు 1,200 మంది స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో అత్యధిక క్రీడాకారులకు సరైన దుస్తులు లేవు. కాళ్లకు షూ కూడా లేకుండా ఒట్టికాళ్లతోనే తమ క్రీడా ప్రతిభను చాటుకునేందుకు తపనపడ్డారు. కనీసం దాతలతోనైనా క్రీడాకారులకు షూ ఇప్పించే అవకాశమున్నా... ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కనిపించలేదు. ఇదే పరిస్థితి జాతీయ స్థాయిలోనూ పునరావృతమైతే... రాష్ట్రపరువు గంగలో కలిసినట్లేనంటూ పలువురు వ్యాఖ్యానించారు.