పరిష్కారం దిశగా విండీస్ సంక్షోభం!
కాంట్రాక్ట్‌లపై మళ్లీ చర్చించనున్న ఇరు పక్షాలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి కారణమైన ఆటగాళ్ల ఫీజు చెల్లింపు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన విండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) సమావేశంలో సభ్యులంతా దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని ప్రకారం సాధ్యమైనంత త్వరగా విండీస్ బోర్డు, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్ మధ్య కొత్త కాంట్రాక్ట్‌కు సంబంధించి మరో సారి చర్చలు జరగనున్నాయి. అయితే ఆటగాళ్ల ప్రతినిధిగా మాత్రం వేవెల్ హైండ్స్ కొనసాగే అవకాశం ఉంది.
భారత పర్యటన నుంచి విండీస్ జట్టు అర్ధాంతరంగా నిష్ర్కమించడంతో బీసీసీఐ రూ. 250 కోట్ల నష్ట పరిహారం కోరిన సంగతి తెలిసిందే. దీంతో పాటు త్వరలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు కూడా అన్నీ చక్కబెట్టి పూర్తి స్థాయి జట్టును పంపాలని కూడా విండీస్ బోర్డు భావిస్తోంది. మరో వైపు సమస్యను పరిష్కరించడంలో విండీస్ బోర్డు విఫలమైందంటూ వన్డే జట్టు కెప్టెన్ డ్వేన్ బ్రేవో చేసిన వ్యాఖ్యలపై, ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా డబ్ల్యూఐసీబీ అధ్యక్షుడు డేవ్ కామెరాన్ బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.