చూయింగ్ గమ్ నమిలితే రూ. 80 కోట్లు ఆదా
చూయింగ్ గమ్ నమలడం ముఖానికి మంచి వ్యాయామమని, అది ముఖ ఆకృతిని అందంగా తీర్చిదిద్దుతుందని వ్యాయామ నిపుణులు చెబుతుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆరోగ్యం కోసం వెచ్చించే సొమ్ము బోలెడు ఆదా అవుతోందట. యూకేలోని ప్లిమౌత్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్‌కు ఏటా దాదాపు రూ. 80 కోట్లు (82 లక్షల పౌండ్లు) ఆదా అవుతుందని తేలింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ప్రతివారం 10 లక్షల మంది ఎన్హెచ్ఎస్ ద్వారా దంత సంబంధిత సేవలు పొందుతున్నారు. తద్వారా ఎన్హెచ్ఎస్పై ఏటా దాదాపు రూ. 33,634 కోట్ల భారం పడుతోంది.
దంత సంబంధిత సమస్యల కారణంగా 12 ఏళ్ల లోపు పిల్లల్లో 35 శాతం మంది హాయిగా నవ్వలేకపోతున్నారని ఓ అధ్యయనంలో గుర్తించారు. దీనికి సరైన పరిష్కారం చూయింగ్ గమ్ నమలడమేనని వారు పేర్కొంటున్నారు. ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత చక్కెర రహిత చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటిలో ఉమ్ము ఉత్పత్తి అవుతుందని, అది పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించడంలో సహకరించడమే కాకుండా.. పళ్లను బలహీనపరిచే ప్లేక్ యాసిడ్స్‌ను క్రమబద్ధీకరిస్తుందని చెప్పారు. అందువల్ల పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చూయింగ్ గమ్ నమలడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ లిజ్ కే స్పష్టం చేశారు.
అధ్యయనం ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, ప్రజలు తమ నోటి ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ విధానం ఎంతగానో సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 12 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు ఒక సుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమిలితే ఎన్హెచ్ఎస్ కు ఏడాదికి దాదాపు రూ. 27 కోట్లు ఆదా అవుతుందని వివరించారు. అదే రోజుకు రెండు చూయింగ్ గమ్స్ తీసుకోవడం వల్ల దాదాపు రూ.32 కోట్లు, మూడు చూయింగ్ గమ్స్ వల్ల దాదాపు రూ.80 కోట్లు ఆదా చేయొచ్చని తెలిపారు. ఈ విధానాన్ని కేవలం 12 ఏళ్ల లోపు పిల్లలకే కాకుండా మిగతావారికి వర్తింపజేస్తే మరింతగా సొమ్ము ఆదా అవుతుందని పేర్కొన్నారు.