ముద్రపడితే ఒట్టు
రుణాల మంజూరుకు ససేమిరా అంటున్న బ్యాంకులు
నిరుద్యోగులకు అందని ఫలాలు
స్వయం ఉపాధి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే యువతకు రుణాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజనను తీసుకొచ్చింది. ఈ పథకాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించింది. అయితే బ్యాంకులు రుణాల మంజూరు విషయంలో జాప్యం చేస్తుండటంతో ఈ పథకం లక్ష్యం నెరవేరలేదు.
సైదాపురం: ముద్రా యోజనను ప్రారంభించి రెండేళ్లు కావస్తోంది. జిల్లాలో ఈ ఏడాది సుమారు 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 9,950 యూనిట్లు మాత్రమే మంజూరు చేసినట్లు సమాచారం. జిల్లాలోని 46 మండలాల్లో ప్రధానమంత్రి ముద్రా యోజన (మైక్రోయూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) కింద సక్రమంగా రుణాలు అందడం లేదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. ఆ ఆదేశాలను బ్యాంకు అధికారులు ఖాతరు చేయకపోవడంతో దరఖాస్తుదారులు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రుణాలు తీసుకున్న తిరిగి చెల్లిస్తారో లేదోనని బ్యాంకు అధికారులు సంకోచిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ముద్ర రుణాల మంజూరుకు బ్యాంకు అధికారులు ముందుకురావడం లేదు.
పథకం తీరుతెన్ను..
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మూడు విభాగాల్లో రుణాలను అందజేస్తారు. ఇందులో శిశు విభాగం కింద రూ.50 వేలు, కిశోర్ విభాగం కింద రూ.5 లక్షలు, తరుణ్ విభాగం కింద రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేయాల్సి ఉంది. రుణాల మంజూరుకు సంబంధించి ఎలాంటి పూచీకత్తులు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రుణాలను అందజేయాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారుడు ఏ వ్యాపారం చేపట్టదలిచాడో అందుకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను బ్యాంకులకు అందజేయాల్సి ఉంది. గుర్తింపు, నివాస రుజువు పత్రాలు, రెండు పాసుపోర్ట్ సైజు ఫొటోలు, మిషనరీ, వస్తువుల కొనుగొలు కొటేషన్, సరఫరాదారుడు పేరు, యంత్రాల కొనుగొలు వివరాలను తెలియజేయాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవారు కుల ధ్రువీకరణ పత్రాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
అందని రుణాలు
ముద్రా రుణాల మంజూరు విషయంలో బ్యాంకు అధికారులు ముందుకు రావడం లేదు. జనాభాను బట్టి రుణాలను మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ముద్రా రుణాలను మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
చిరు వ్యాపారులకు ప్రయోజనం
ముద్రా రుణాలు విషయంలో చిరువ్యాపారులకు ప్రయోజనం ఉంది. బ్యాంకర్లు రుణాలను మంజూరు చేసి వ్యాపారులకు సహకరించాలి. నిరుద్యోగులకు రుణాలను మంజూరు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది.
– బండి రాజేంద్ర, నల్లబొట్లపల్లి
సకాలంలో మంజూరు చేయాలి
వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో ముద్రా రుణాలను అందించాలి. అర్హులైన వారందరికీ రుణాలు మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మహంకాళి సునీల్, సైదాపురం
9,950 యూనిట్లు మంజూరు చేశాం
జిల్లాకు ఈ ఏడాది సుమారు 9,950 యూనిట్లు మంజూరు చేశాం. సుమారు రూ.20.50 కోట్లు లబ్ధిదారులకు అందించనున్నాం. ప్రతి బ్యాంక్‌కు ఓ టార్గెట్‌ను నిర్దేశించాం. ఆ టార్గెట్ ప్రకారం లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేస్తారు.
– వెంకట్రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్