ఎన్నికల ప్రచారంలో పురిటినొప్పులు
పుణె: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా కార్పొరేటర్ అభ్యర్థి పోలింగ్ జరగకముందే విజయాన్ని సాధించారు. అదెలా అంటే.. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ రూపాలి పాటిల్ పుణె మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నేతల తరహాలోనే ఆమె తన ప్రచారాన్ని కొనసాగిస్తుండగా గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. పార్టీ నేతలు ఆమెను పుణెలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
శుక్రవారం ఉదయం తన రెండో కాన్పులో ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఓటింగ్ జరగకముందే తమ అభ్యర్థి రుపాలి విజయం సాధించారంటూ ఎంఎన్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎన్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ అయిన రుపాలి శనివార్ పేట్-నారాయణ్ పేట్ నుంచి 15వ వార్డు నుంచి కార్పొరేటర్ గా మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్న విషయం తెలిసిందే.
రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం
వాస్తవానికి డాక్టర్లు పాటిల్ కు మార్చి 5న డెలివరి డేట్ ఇచ్చారు. అయితే దాదాపు నెల రోజుల ముందే తాను ఈ సంతోషాన్ని పొందానని పాటిల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బిబీగా పాల్గొనడం, నడవటం లాంటి వాటితో ఇలా జరిగి ఉండొచ్చుని చెప్పారు. డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే మరో రెండు రోజుల్లోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎంఎన్ఎస్ అభ్యర్థి రుపాలి పాటిల్ తెలిపారు.