పీఎంపీలకు శిక్షణ ఇచ్చేలా కృషి
తాడేపల్లిగూడెం :(తాలూకా ఆఫీస్ సెంటర్) :నూతన వైద్య విధానంపై పీఎం పీలకు శిక్షణ ఇచ్చే విధంగా రాష్ట్ర కేబినెట్లో చర్చించి కృషి చేస్తానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా 52వ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వి. మురళీ కృష్ణమూర్తి అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ జనవరి 2న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి నూతన వైద్య విధానంపై శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు కోసం చర్చిస్తానని తెలిపారు. పీఎంపీలు సీజనల్ రోగాలపైన, ఎయిడ్స్ తదితర వ్యాధులపైన ప్రజ లను అప్రమత్తం చేయాలని కోరారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు, చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌ను సన్మానించారు. అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు శిరిగినీడి నాగభూషణం, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు మోదుగ కృష్ణారావు, సెంట్రల్ యాక్షన్ కమిటి చైర్మన్ వీబీటీ రాజు, పీఎంపీ రాష్ట్ర సలహాదారు కె. ఎస్.ఎన్.బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కోటేశ్వరరావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పీఎంపీలు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
తాడేపల్లిగూడెం : నియోజకవర్గ అభ్యున్నతికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సూచించారు. శనివారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, మునిసిపల్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. గూడెం పరిధిలో ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధికి రూ.14 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పట్ణణంలో వివిధ పనుల కోసం రూ.2.50 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. పురపాలక సంఘంలో పారిశుధ్యం మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రెండో ఫ్లైఓవర్ వంతెన కోసం సేకరించిన స్థలంలో నిర్వాసిత కుటుంబాలకు శివాలయం సమీపంలో స్థలాలు కేటాయించేందుకు ఏర్పాటు చేసినట్టు తహసిల్దార్ నాగమణి మంత్రికి వివరించారు. బీసీ రుణాల దరఖాస్తు స్వీకరణ తేదీని పెంచేందుకు సంబంధిత శాఖ మంత్రి ర వీంద్రతో చర్చిస్తున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.