రాజ్యసభలో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: రాజ్యసభలో గందరగోళం నెలకొంది. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని పట్టుబట్టడంతో అధికార విపక్షాల మధ్య వాదవివాదాలు నెలకొన్నాయి. దీంతో సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇదే అంశంపై మూడు సార్లు వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభకాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ 'మోదీ విదేశాల్లో ఉన్నప్పుడు కొన్ని మాటలు అన్నారు. వాటికి వివరణ ఇవ్వాలి. దేశం తరుపున విదేశీ పర్యటనలకు ప్రధానిగా వెళ్తున్న ప్రధానులంతా ఓ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
విదేశాల్లో ప్రధాని ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. కెనడా వెళ్లినప్పుడు స్కామ్ ఇండియా అన్నారు. ఇండియా మొత్తం కుంభకోణాల దేశమా.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది తప్ప భారత్ కుంభకోణాల దేశం కాదు.అంతేకాకుండా 60 ఏళ్ల నుంచి మురికి పేరుకుపోయిందని, దానిని తాను శుభ్రం చేస్తున్నానని అన్నారు. దీంతో ఆయన తన హోదాను స్వయంగా తగ్గించుకున్నారు. మాజీ ప్రధానులందరినీ అవమానించారు' దీనిపై చర్చించాల్సిందే అంటూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. మోదీ దేశానికి ప్రధానిగా విదేశాలకు వెళ్లారు తప్ప బీజేపీ నేతగా వెళ్లలేదని చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు అడ్డు చెప్పడంతో సభలో గందరగోళం తోడైంది.
ఆనంద్ శర్మకు మద్దతుగా జేడీయూ, సమాజ్ వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐఎం తోడయ్యాయి. విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధాని మోదీ భాష ఏమాత్రం బాగాలేదని, దేశాన్ని దేశ ప్రముఖ వ్యక్తులను విదేశాల్లో అవమాన పరిచేలా ఉందని అభ్యంతరం చెప్పారు. కాగా, ప్రధాని మాటలను కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ సమర్థించారు. ఆ విషయం చర్చించాలంటే 60 ఏళ్లలో జరిగిన కుంభకోణాలన్నింటిపై చర్చజరగాల్సిందేనని అన్నారు. దీంతో సభ రెండుగంటలవరకు వాయిదా పడింది.