ఆశ్చర్యం!
కూడేరు(అనంతపురం జిల్లా): ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షా భావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వందలాది అడుగుల లోతు బోర్లు వేయించినా చుక్కనీరు లభించడం గగనమైంది. నీటి కోసం ఇటు రైతులు, అటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఓ పక్కన ఎండలు మండుతుంటే మెట్ట ప్రాంతంలో మూడు అడుగులు తవ్విన గుంతలో నీరు ఊరుతోంది. ఆ నీటిని చూసి ఇక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
కూడేరు మండలం పి.నారాయణపురంలో కురుబ బండారు గోపాల్ అనే రైతు తన పొలంలో మామిడి మొక్కలు నాటేందుకు శనివారం 3 అడుగులు చొప్పున గుంటలు తవ్వించడం మెదలు పెట్టాడు. అందులో ఒక గుంటలో రెండు అడుగులు తవ్వగానే నీటి తేమ కనిపించింది. మూడు అడుగులు తవ్వగానే నీరు ఉబకడం మొదలు పెట్టింది. సగం గుంతకు వచ్చిన నీటిని బయటకు తొలగించారు. ఆ గుంటలో ఆదివారం మళ్ళీ నీరు ఊరడం మొదలు పెట్టింది. ఊట నీరు తియ్యగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలియడంతో ఆశ్చర్యపోతున్న గ్రామస్తులు గుంటలో నీటిని చూసేందుకు తరలివస్తున్నారు.
ఈ ప్రాంత రైతులు, ప్రజలు మాట్లాడుతు ఈ భూమికి కొద్ది దూరంలో ఒక వంక ఉందని, అయితే అక్కడ చుక్క నీరు కూడా లేదని చెప్పారు. కానీ ఇక్కడ ఊహించిన రీతిలో గుంటలో నీరు ఊరడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.