ప్రముఖ కవి ఎన్కే కన్నుమూత
1970ల్లో కవిత్వంతో ఉర్రూతలూగించిన కోదండరామారావు
శ్రీశ్రీ, చెరబండ రాజు, కాళోజీ సోదరులకు సన్నిహితుడు
హన్మకొండ: ఎన్కేగా ప్రసిద్ధులైన ప్రముఖ కవి నెల్లుట్ల కోదండరామారావు శనివారం రాత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన ఆయన హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1970 దశకంలో విప్లవోద్యమం ఊపిరిపోసుకుంటున్న సమయంలో ఎన్కే తన కవిత్వంతో ఉర్రూతలూగించారు. ఆయన రాసిన ప్రతీ కవిత గోడలపై నినాదంగా కనిపించేది.
1969లో వరంగల్లో వచ్చిన తిరగబడు కవుల ఉద్యమంలో ఎన్కే భాగస్వామ్యం వహించగా.. తిరగబడు కవితాసంకలనంలో ఆయన రాసిన ‘లాల్ బనో.. గులామి చోడో బోలో వందేమాతరం’ కవిత ఆనాటి కవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విప్లవ కవులు వరవరరావు, చెరబండ రాజు, శ్రీశ్రీ, లోచన్ తదితర మహాకవులతో కలిసి పనిచేసిన నెల్లుట్ల.. మిత్రమండలి సమావేశాల్లో పాల్గొంటూ కాళోజీ రామేశ్వరరావు, కాళోజీ నారాయణరావుతో సన్నిహితంగా మెదిలేవారు. సృజన పత్రిక నడిపించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆయన.. కవితలు రాయడమే కాకుండా శ్రోతలను ఉర్రూతలూగించేలా చదవడం, విప్లవ గేయాలను పాడటంలో దిట్ట. తన మిత్రుడు సుధీర్, దేవులపల్లి సుదర్శన్రావుతో కలిసి పనిచేసిన ఎన్కే నిర్బంధ కాలంలోనూ తన విలువలు, విశ్వాసాలకు అనుగుణంగానే పనిచేశారు.