హీటర్‌పై మూత్రం పోయించాడు
లక్నో : వరుస చోరీ కేసుల్లో అరెస్ట్ చేసిన ఇద్దరి వ్యక్తులను విచారణలో భాగంగా వారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించి... తన ఉద్యోగానికి ఎసరు పెట్టుకున్నాడు ఓ ఎస్ఐ. వివరాలు ఇలా ఉన్నాయి... ఉత్తరప్రదేశ్ బరిచా జిల్లాలోని దర్గా పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సోను (23), కాలు (24) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు. విచారణలో భాగంగా ఎస్ఐ అజిత్ వర్మ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించాడు. ఆ క్రమంలో వారితో మూత్రం తాగించడమే కాకుండా... కరెంట్ హీటర్‌పై మూత్రం పోయించాడు.
అలాగే ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోశాడు. దీంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనంతరం వారిని బుధవారం సాయంత్రం ఇంటికి పంపించారు. వారి పరిస్థితి విషమంగా మారడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది... జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించారు. జిల్లా పోలీస్ అధికారి వెంటనే స్పందించి.... వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేయాలని బాధితుల కుటుంబసభ్యుల పోలీసు ఉన్నతాధికారులు డిమాండ్ చేసి ఆందోళనకు దిగారు. దీంతో ఎస్ ఐ అజిత్ వర్మపై సస్పెన్షన్ వేటు వేశారు.