బంగారానికి మెరుగు పేరుతో మోసం
ఖమ్మం : బంగారానికి మెరుగు పెడతామని ఓ వృద్ధురాలిని ఇద్దరు దుండగులు మోసగించారు. 1.80లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. ఖమ్మం వన్ టౌన్ రైటర్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం... బ్రాహ్మణ బజార్లో నివసిస్తున్న న్యాయవాది శేషాద్రి శిరోమణి ఇంటికి బుధవారం సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు వచ్చి, బంగారానికి మెరుగు పెడతామని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఆ న్యాయవాది తల్లి సీతమ్మ ఒక్కరే ఉన్నారు. వారిని నమ్మిన ఆ వృద్ధురాలు... తన బంగారపు గాజులను మెరుగు పెట్టేందుకని వారికి ఇచ్చింది. వారు వాటిని తీసుకుని, మెరుగు పెట్టినట్టుగా నటించారు.
ఆ తరువాత పొయ్యిపై గిన్నెలో నీటిని మరిగించి వాటిని అందులో వేశారు. కొద్దిసేపటి తర్వాత ఆ నీటి నుంచి నగలను తీసుకోవచ్చని చెప్పి, మెరుగు పెట్టినందుకు డబ్బులు తీసుకుని వెళ్లిపోయూరు. వారు వెళ్లిన కొద్దిసేపటి తరువాత ఆ గిన్నెలో బంగారపు గాజులు కనిపించలేదు. వాటిని ఆ ఇద్దరు యువకులే కాజేశారని గ్రహించిన ఆమె లబోదిబోమంటూ తన కూమారుడికి సమాచారమిచ్చింది. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీస్ శాఖ విశ్రాంత ఉద్యోగి(రిటైర్డ్ సీఐ)ని ఇలాగే మోసగించి లక్షల రూపాయల విలువైన బంగారపు నగలు చోరీ చేశారు.