రంగంలోకి రాజకీయ ఉద్యోగులు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: కొత్త ప్రజాప్రతినిధులొచ్చారు.. వారిలో కొందరు మంత్రులు కాబోతున్నారు.. ఇంకొం దరికీ కీలక అధికార పదవులు వరించే అవకాశం ఉంది. ఇప్పటినుంచే వారి పంచన చేరితే అధికారం చెలాయించొచ్చు.. బాస్‌ల మాటున రాజకీయం చేయొచ్చు.. పనిలో పనిగా కొంత వెనకేసుకోనూ వచ్చు. ఇదే దూరాలోచనతో పలువురు ‘రాజకీయ’ ఉద్యోగాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తలుపు తడుతున్నారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి అభినందనల పేరుతో వారి ఇళ్ల ముంగిట క్యూ కడుతున్నారు.
కొందరు కేక్ కటింగ్‌లు, ఫంక్షన్ల పేరుతో భారీ గా ఫ్లెక్సీలు పెట్టిస్తే... మరికొందరు ఖరీదైన బహుమతులతో నేతల మనసు దోచుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ, తదితర ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తలతో సమానంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్ర భుత్వ కార్యాల యాల్లో పెద్దగా పనులు లేవు. ఇదే అదనుగా ప్రజాప్రతినిధుల కటాక్షం పొందడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజకీయ పోస్టులతోపాటు ఆర్థికంగా కీలకమైన పోస్టులకు చాలామంది ఎగబడుతున్నారు. ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు కులం, ప్రాంతం, బంధుత్వం, స్నేహం వంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
పోలీస్, రెవెన్యూ శాఖలపైనే దృష్టి
మరోవైపు కీలకమైన పోస్టుల్లో తమవారినే కూర్చోబెట్టాలని ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సైతం ఆరాటపడుతున్నారు. అధికార స్థానాల్లో తమ వారుంటేనే పూర్తిస్థాయిలో రాజ కీయాధికారం చెలాయించడానికి వీలవుతుం దని భావిస్తున్న నేతలు తమకు అనుకూలురైన, విశ్వాసపాత్రులైన ఉద్యోగులను నియమింపజేసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధానమైన రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖలపై వీరు దృష్టి సారిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఆలోచనలు, అవసరాలను గమనించి ఆయా శాఖల అధికారులు కూడా తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగి స్తున్నారు. ముఖ్యంగా తహశీల్దార్లు, ఎంపీడీవో లు, ఎస్సైలు, సీఐలు, ఇంజినీరింగ్ అధికారులు ఈ తరహా బదిలీల జాబితాలో చేరుతున్నారు.
వ్యక్తిగత సహాయకుల పోస్టులకు పోటీ..
ప్రజాప్రతినిధులకు ప్రభుత్వపరంగా వ్యక్తిగత సహాయకులను (పీఏ) నియమించుకునే సౌకర్యం ఉంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీ, జెడ్పీ చైర్మన్ తదితర నేతల వద్ద పీఏ పోస్టులకు తీవ్ర పోటీ ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఈ పోస్టులపై కన్నేశారు. గతంలో పలువురు నేతల వద్ద పీఏలుగా పనిచేసిన అనుభవమున్న ఉద్యోగులు, పదేళ్ల క్రితం టీడీపీ ప్రజాప్రతినిధుల వద్ద పీఏలుగా చేసినవారు అవకాశం కోసం అర్రులు చాస్తున్నారు. జిల్లాలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్పర్సన్ ఉం డగా మొత్తం 12 మంది పీఏలు అవసరం. వీరిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద చేరేందుకే ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సిబ్బంది వీటి కోసం తీవ్ర యత్నాలు చేస్తున్నారు.