బహుముఖప్రజ్ఞాశాలి కిషోర్‌కుమార్‌కు గూగుల్ నివాళి
బహుముఖప్రజ్ఞాశాలి కిషోర్ కుమార్‌కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘన నివాళి అర్పించింది. గూగుల్ అనే ఆరు ఇంగ్లీష్ అక్షరాలలో ఎల్ స్థానంలో కిషోర్ కుమార్ ఫొటోను ఉంచి ఆయనకు తగిన గౌరవాన్ని అందించింది. ఎక్కవ మందికి గాయకుడిగా మాత్రమే తెలిసిన కిషోర్ కుమార్‌కు సినిమా రంగంలోని 24 శాఖలలో అవగాహన ఉంది. 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిద్ధిగాంచిన కిషోర్ కుమార్ బాలీవుడ్లో నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, హాస్యం, డబ్బింగ్ ఆర్టిస్ట్...ఒకటేమిటి అన్నిరంగాలలో తన ప్రతిభను కనపరచి ప్రేక్షకులను రంజింపజేశారు. అశోక్ కుమార్, అనూప్ కుమార్ల ముద్దుల తమ్ముడైన కిషోర్ కుమార్ 1929 ఆగష్టు 4న ఖాండ్వా గ్రామంలో జన్మించారు.
హిందీ చిత్రరంగంలో హెమాహెమీలైన సంగీత దర్శకులు అందరూ అందరి హీరోలకు కిషోర్ చేత పాడించారు. కిషోర్ ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. అయితే రాజేష్ ఖన్నా-కిషోర్ కాంబినేషన్లో పాడిన పాటలకు అత్యధిక ప్రజాదరణ లభించింది. ఆర్డి బర్మన్-కిషోర్ కుమార్ కాంబినేషన్లో మహాఅద్బుత గీతాలు సృష్టి జరిగింది. "చల్తీకా నాం గాడీ" చిత్రంలో అన్నదమ్ములు అశోక్, అనూప్, కిషోర్ ముగ్గురూ నటించారు. ఈ చిత్రంలో కిషోర్ పాటలు దేశమంతటా మారుమ్రోగాయి. ఇంతటి గాయకుడు అందుకున్న పురస్కారాల జాబితా ఎంత ఉంటుందో అర్ధం చేసుకుకోవచ్చు. కిషోర్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. రుమాదేవి,మధుబాల, యోగితా బాలి,లీనా చందావర్కర్లు ఆయన భార్యలే.
1987 అక్టోబరు 13వ తేది. ఆ రోజు దీపావళి. ఆ రోజునే కిషోర్ మరణించారు. అదే రోజు అతని సోదరుడు అశోక్ కుమార్ పుట్టిన రోజు. అప్పటి నుంచి అశోక్‌కుమార్ దీపావళి గానీ, పుట్టిన రోజును గానీ జరుపుకోలేదు. కిషోర్ మరణించి 35 ఏళ్లు దాటి పోయింది. బాలీవుడ్లో ఆ ఖాళీని ఎవరూ పూరించలేకపోయారు. ఇక ముందు కూడా ఆ అవకాశంలేదు.
- శిసూర్య