అమెరికన్ల పూర్వీకులు ఎవరో తెలుసా?
వాషింగ్టన్: మొన్నటిదాకా అమెరికన్లు 23000 ఏళ్ల క్రితమే సైబీరియా నుంచి వలస వచ్చారని చెప్పిన పరిశోధకుల లెక్క తప్పింది. అమెరికన్ల పూర్వీకులు సైబీరియా నుంచి కాదు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలోని అమేజాన్ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు, ఆస్ట్రేలియాలో ప్రజల జన్యువులకు సారూప్యతలు ఉండటంతో శాస్త్రవేత్తలు కంగుతిన్నారు.
ఇంతకాలం అమెరికన్లకు దక్షిణ ధ్రువాల నుంచి వచ్చిన ఒకే జాతి నుంచి ఉద్భవించారనుకుంటున్న శాస్త్రవేత్తల అంచనాలు తాజా పరిశోధనలతో తలకిందులయ్యాయి. మేం ముఖ్యమైన విషయాలను గుర్తించలేకపోయామని ఈ బృందానికి నేతృత్వం వహించిన డేవిడ్ రీచ్ అభిప్రాయపడ్డారు. బ్రెజిల్లో నివసిస్తున్న స్థానిక అమెరికన్లు ఆస్ట్రేలియా, న్యూగినియా, అండమాన్ నికోబార్ దీవుల్లో గిరిజనులకు జన్యుసారూప్యత ఉందని ఈ అంశంపై తాజాగా పరిశోధన చేసిన పొంటూస్ స్కోగ్లండ్ వెల్లడించారు.
ఈ ఫలితాలు ఊహించలేద న్నారు. ఈ బృందం దక్షిణ మధ్య అమెరికాకు చెందిన దాదాపు 21 స్థానిక అమెరికన్ సమూహాలు, బ్రెజిల్‌లోని 9 రకాల సమూహాల నుంచి సేకరించిన జన్యుసమాచారాన్ని విశ్లేషించారు. వీటిని మరో 200 అమెరికనేతర సమూహాల జన్యువులతో పోల్చిచూడగా సరిపోలలేదు. కానీ, అమేజాన్ పరివాహంలో నివసించే సురాయి, కరిటియానా, గ్జావెంటే గిరిజన తెగల డీఎన్ఏతో ఆస్ట్రేలియాలోని గిరిజనుల డీఎన్ఏను పోల్చినపుడు సరిగ్గా సరిపోయింది. ఈ ఫలితాలతో అమెరికన్లు సైబీరియా నుంచి కాదు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.