Ponnam Brabhakar
-
పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డి
రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలి మంత్రి జగదీష్‌రెడ్డికి కాంగ్రెస్ నేత పొన్నం సవాల్ సూర్యాపేట: ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డికి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి ఒక్కరూ జిల్లా, రాష్ట్ర కీర్తిని నిలబెట్టారు కానీ.. దురదృష్టం కొద్ది మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం అవినీతి ఆరోపణలతో ఆ కీర్తికి మచ్చ తెచ్చారని విమర్శించారు. ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా తాను ఆరోపణలు చేశానని.. అయితే, ప్రభుత్వం వేయని పరువు నష్టం కేసు.. మంత్రి ఎందుకు వేశారో చెప్పాలన్నారు. పరువునష్టం కేసు జూన్ 3కు వాయిదా కాగా పరువు నష్టం దావా కేసులో పొన్నం ప్రభాకర్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి జడ్జి డి.కిరణ్‌కుమార్ జూన్ 3కు కేసును వాయిదా వేశారు. సరే.. కాంగ్రెస్ సిద్ధమా.. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి సవాల్ సూర్యాపేట: తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు సిద్ధమా అని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ కోర్టులో ఆధారాలు ఎందుకు చూపలేదని, కోర్టు సమన్లు పంపినా ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆరోపణలు చేసినందుకు కోర్టును ఆశ్రయించానని మంత్రి తెలిపారు. తనపై అక్కసుతో చేసిన ఆరోపణలను కోర్టులో రుజువు చేయాలని పేర్కొన్నారు. తన 14ఏళ్ల ఉద్యమ చరిత్రలో తెల్లకాగితంలా ఉన్నానని, నిబద్ధతతో ఉద్యమాలు చేశానని చెప్పారు. పొన్నం తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో కోర్టును ఆశ్రయించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ ఎక్కడ అడ్రస్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపైకి ఒక శిఖండిని వదిలారని విమర్శించారు. నేరస్తుడిగా కోర్టుకు వచ్చిన పొన్నంకు జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలకడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. -
కాంగ్రెస్ ప్రభంజనంతో కేసీఆర్ బెంబేలు
అందుకే సుడిగాలి పర్యటనలు: పొన్నం ఎల్కతుర్తి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు బెంబేలెత్తిపోతున్నారని, అందుకే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని కరీంనగర్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు సోనియాను ప్రజలు దేవతలా ఆరాధిస్తుంటే జీర్ణించుకోలేక.. సీఎం కుర్చీ కోసం కుటుంబాన్ని వెంటేసుకుని కాంగ్రెస్ పార్టీపై బురదచల్లుతున్నాడని విమర్శించారు. ఎవరు సన్యాసులో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే తేల్చుతారని పేర్కొన్నారు. మాజీ సీఎం కిరణ్ చెప్పును గుర్తుగా పెట్టుకున్నాడని, ఎన్నికల తర్వాత ఆయన తన చెప్పుతో తానే కొట్టుకునే రోజులు వస్తాయని ఎద్దేవా చేశారు. -
'కాంగ్రెస్ గుర్తించకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే ఉండేవాడివి'
కరీంనగర్: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని విమర్శిస్తున్న సీమాంధ్ర నాయకులు ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. యాబై ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉంటూ, మచ్చలేని నాయకుడైన జైపాల్‌రెడ్డిని.. ఆయన భాషలోనే చెప్పాలంటే కొంతమంది శుంఠలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మిత్రుడని, కాంగ్రెస్ గుర్తించి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అనువాదకుడి పోస్టు ఇచ్చిందన్నారు. లేదంటే గొంతు బాగుంది కనుక సినిమాలకు డబ్బింగ్ చెప్పుకొంటూ, ఆటోలో మైక్‌ద్వారా సినిమా ప్రచారం చేసుకొంటూనో ఉండేవాడని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర నాయకులు జైపాల్‌రెడ్డికి క్షమాపణ చెబితే కొంతైనా శుంఠల స్థాయిని తగ్గించుకుంటారన్నారు. -
కిరణ్‌ను సీఎంగా భావించడం లేదు: పొన్నం
సీమాంధ్ర ఉద్యమానికి స్పాన్సరర్‌గా, సమైక్యాంధ్ర జేఏసీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తాము ముఖ్యమంత్రిగా చూడడం లేదని ఎంపీ పొన్న ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉంటే తాము సీఎంను సంప్రదించడం లేదని, నేరుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టి జైలుకు పంపిన సీఎం, డీజీపీలు.. సీమాంధ్రులకు ఎస్కార్ట్ ఇచ్చిమరీ ఉద్యమానికి సహకరిస్తున్నారని విమర్శించారు. ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ దినేష్‌రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రులే రాజీనామాలు చేసినప్పుడు డీజీపీ ఎందుకు తప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దినేష్‌రెడ్డి డీజీపీ పదవిలో ఉంటే ఆయనపై విచారణ ఎలా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, దానిని ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. ఏపీఎన్జీవోలు హైకోర్టు చెప్పినా సమ్మె కొనసాగిస్తామనడం కోర్టు ధిక్కారం అవుతుందని తెలిపారు. ఈనెల 17న ఎంపీలమంతా మళ్లీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు.