పొన్నం వర్సెస్ జగదీశ్ రెడ్డి
- రాజీనామా చేసి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలి
- మంత్రి జగదీష్‌రెడ్డికి కాంగ్రెస్ నేత పొన్నం సవాల్
సూర్యాపేట: ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రజాకోర్టుకు సిద్ధం కావాలని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డికి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి ఒక్కరూ జిల్లా, రాష్ట్ర కీర్తిని నిలబెట్టారు కానీ.. దురదృష్టం కొద్ది మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రం అవినీతి ఆరోపణలతో ఆ కీర్తికి మచ్చ తెచ్చారని విమర్శించారు. ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లుగా తాను ఆరోపణలు చేశానని.. అయితే, ప్రభుత్వం వేయని పరువు నష్టం కేసు.. మంత్రి ఎందుకు వేశారో చెప్పాలన్నారు.
పరువునష్టం కేసు జూన్ 3కు వాయిదా
కాగా పరువు నష్టం దావా కేసులో పొన్నం ప్రభాకర్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి జడ్జి డి.కిరణ్‌కుమార్ జూన్ 3కు కేసును వాయిదా వేశారు.
సరే.. కాంగ్రెస్ సిద్ధమా.. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతి సవాల్
సూర్యాపేట: తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు సిద్ధమా అని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ కోర్టులో ఆధారాలు ఎందుకు చూపలేదని, కోర్టు సమన్లు పంపినా ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆరోపణలు చేసినందుకు కోర్టును ఆశ్రయించానని మంత్రి తెలిపారు.
తనపై అక్కసుతో చేసిన ఆరోపణలను కోర్టులో రుజువు చేయాలని పేర్కొన్నారు. తన 14ఏళ్ల ఉద్యమ చరిత్రలో తెల్లకాగితంలా ఉన్నానని, నిబద్ధతతో ఉద్యమాలు చేశానని చెప్పారు. పొన్నం తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న సందర్భంలో కోర్టును ఆశ్రయించానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ ఎక్కడ అడ్రస్ లేకుండా పోతుందనే ఉద్దేశంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపైకి ఒక శిఖండిని వదిలారని విమర్శించారు. నేరస్తుడిగా కోర్టుకు వచ్చిన పొన్నంకు జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలకడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.