
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరోసారి పార్టీ అధినాయకత్వంపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. పార్టీకి పునరుత్తేజం రావాలంటే అనుభవంతో కూడిన ఆలోచనలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించ గల సామర్థ్యంతో పాటు రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. తాము ఆశించిన స్థాయిలో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదని కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలివైనదని, ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో తప్పకుండా గుర్తిస్తుందన్నారు.
పార్టీ అధినాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ గత ఆగస్టులో లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. ఈ అంశంపై పార్టీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే తన అభిప్రాయాలు తీసుకోవడానికి ఇప్పటికీ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేయడంలేదని, బహిరంగంగా వ్వక్తపరచకుండా తనను పార్టీ నిర్భందించిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా నాయకత్వ మార్పు చేసి దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మనతో కలిసి రావాలనుకోవడం సరైంది కాదని మనమే ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనుభవం ఉన్నవారిని ప్రోత్సహించాలని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
బిహార్‌తో పాటు ఉప ఎన్నికల్లో ఓటమిని సాధారణ విషయంగానే భావిస్తున్నట్లు ఉందని, ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు పార్టీ భావిస్తున్నట్లు ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ ఎంపీ కార్తి చిదంబరం ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment