అఖిలేశ్ సమక్షంలో సిబల్ నామినేషన్
లక్నో: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, జి–23లోని కీలక సభ్యుడు కపిల్ సిబల్ (73) కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. మే 16వ తేదీనే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేగాక సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ఆయనతో పాటున్నారు. నామినేషన్ అనంతరం సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో తనది మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధమని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ నెల 16వ తేదీనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నేనిక ఆ పార్టీ నాయకుడిని కాదు’’ అని తేల్చిచెప్పారు.
అంతా ఒక్కతాటిపైకి రావాలి
‘‘కాంగ్రెస్‌తో నాకు లోతైన అనుబంధముంది. 30–31 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగడం మాములు విషయం కాదు. నేను కాంగ్రెస్‌లో చేరడానికి ముఖ్య కారణం దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 31 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానంటే ఏం జరిగిందో ఆలోచించండి. అందుకే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు (పార్టీకి రాజీనామా) తీసుకోకతప్పదు. అయితే నా సిద్ధాంతం కాంగ్రెస్‌తో ముడిపడి ఉంటుంది. కాంగ్రెస్ సిద్ధాంతానికి నేను దూరం కాలేదు. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. పార్టీలో క్రమశిక్షణ పాటించాలి.
అదేసమయంలో స్వతంత్రంగా గొంతుక వినిపించే అవకాశం ఉండాలి. మీరు గొంతెత్తినప్పుడు మరో పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శలు వచ్చే పరిస్థితి ఉండకూడదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి వ్యక్తిగతం కృషి చేస్తా. అన్ని సిద్ధాంతాలను కలుపుకొని ముందుకెళ్తాం. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం), స్టాలిన్ (తమిళనాడు సీఎం).. ఇలా ఎవరైనా కావొచ్చు. అందరూ చేతులు కలపాలి. 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలి’’ అని కపిల్ సిబల్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ విశాలమైన పార్టీ: కె.సి.వేణుగోపాల్
కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ నిష్కృమణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ అని, అందులో చాలామందికి చోటు ఉందని వ్యాఖ్యానించారు. హరియాణాలో రెండు రోజుల క్రితం 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, దానికి మీడియాతో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు.
అజంఖాన్ సిఫార్సుతోనే..
సిబల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సమాజ్‌వాదీ మద్దతు వెనక ఆ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మద్దతుందని చెప్తున్నారు. ఆయనకు బెయిల్ ఇప్పించడంలో సిబల్ కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని ఎస్పీ నాయకత్వాన్ని అజంఖాన్ కోరినట్లు తెలిసింది. ఎస్పీకి యూపీ నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపింత సంఖ్యాబలం ఉంది. సిబల్ వంటి సీనియర్ నేత, లాయర్ రాజ్యసభలో ఉండడం దేశానికి మంచిదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. సిబల్ రాజ్యసభ పదవీ కాలం జూలై 4తో ముగియనుంది.
సిబల్ కొంతకాలంగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తి వార్తల్లోకెక్కారు. గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సునీల్ జాఖడ్, హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే.
#WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022
Comments
Please login to add a commentAdd a comment