బుద్ధుని ఎరుకకు... సులువైన గ్రంథం....
బౌద్ధం గురించి రాసేవారు సాధారణంగా బౌద్ధంలోని పారిభాషిక పదాలను ఎధేచ్ఛగా ఉపయోగిస్తారు. బౌద్ధం గురించి ఏం రాసినా తమకు అర్థమైంది కనుక ఎదుటివారికి కూడా అర్థమైపోతుంది అన్నట్టుగా రాసుకుంటూ పోతారు. దీని వల్ల చాలా గ్రంథాలు పఠనీయతను కోల్పోతాయి. కాని పండితుల కంటే కూడా ఒక్కోసారి సామాన్యులు రాసే పుస్తకాలు ఎక్కువ మేలు చేస్తాయనడానికి ‘బుద్ధుడు-బౌద్ధధర్మం’ ఒక ఉదాహరణ. రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి ఒక సీనియర్ జర్నలిస్టు కనుక బుద్ధుడి గురించి పాఠకుడు ఎంత చెప్పాలి ఎలా చెప్పాలి ఎంత సులువుగా చేరవేయాలి తెలుసుకొని మరీ ఈ గ్రంథం రాయడం వల్ల ఆబాల గోపాలం అతి సులువుగా బుద్ధుడి గురించి బౌద్ధధర్మం గురించి తెలుసుకోవడానికి వీలయ్యే పుస్తకంగా రూపు దాల్చింది.
బుద్ధుని పుట్టుక, ప్రయాణం, జ్ఞానోదయం, ప్రచారం, నిర్వాణం... ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. శీలం, నిష్కామం, దానం, ఉపేక్ష, వీర్యం, క్షాంతి, సత్యం, అధిష్టానం, కరుణ, మైత్రి... ఈ పది ఉత్తమ గుణాలను మానవులు ఆచరించాలి. పంచశీల, చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గం... ఇవన్నీ మనిషి అనునిత్య క్షోభ నుంచి విముక్తం చేసే బోధకాలు. వీటిని వివరంగా సులభంగా తెలియ చేసే పుస్తకం ఇది. పాఠకుల కోసం బౌద్ధాన్ని పరిశోధించి ఈ పుస్తకాన్ని రాసినందుకు కృష్ణారెడ్డికి అభినందనలు తెలియచేయాలి.
బుద్ధుడు - బౌద్ధధర్మం; డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి; వెల: రూ.75 ప్రతులకు: 9440974788
డైరీ:
13వ ఆటా మహాసభల ప్రత్యేక సంచిక కోసం రచనలు ఆహ్వానిస్తున్నారు. కథ, కవిత్వం, వ్యాసం... ఏదైనా పంపవచ్చు. ఉత్తమమైన వాటికి బహుమతిగా 116 డాలర్ల బహుమతి కూడా ఉంటుంది. గడువు మార్చి 30. వివరాలుకు: http://www. ataconference.org
మార్చి 9 ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్హాల్లో చిన్ని నారాయణరావు కవితాసంపుటి ‘గుండె దీపం’ ఆవిష్కరణ.
మార్చి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు మోహన్రుషి కవితా సంపుటి ‘జీరో డిగ్రీ’ ఆవిష్కరణ. వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఇందిరా పార్క్ దగ్గర.