స్త్రీ విద్య కోసం పోరాడిన పూలే
ఏలూరు (మెట్రో) : సమాజంలో సాంఘిక, మూడ నమ్మకాలను ఖండించి స్త్రీల విద్య కోసం పోరాడిన మహావ్యక్తి జ్యోతిరావు పూలే అని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన పూలే 191వ జయంతి సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో స్త్రీలు అభివృద్ధి చెందకుంటే ఆ సమాజం అభివృద్ధి చెందదని, మహిళలు విద్యావంతులు కావాలని పూలే ఆకాంక్షించారన్నారు. మహిళల విద్య కోసం ఆ రోజుల్లోనే ఎంతో కృషి చేసిన వ్యక్తి పూలే అన్నారు. ప్రతి ఒక్కరూ పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ బలహీన వర్గాలకు పూలే ఆశాజ్యోతి అన్నారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. బీసీ నాయకులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన పూలే జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పూలే తన జీవితాన్ని సమాజాభివృద్ధికి దారపోశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, జిల్లా పరిషత్ సీఈవో డి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి
వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.