ఐటీ జీతాల్లో భారత్ వరస్ట్
వార్షిక వేతనం సగటున 41,213 డాలర్లు
స్విట్జర్లాండ్‌లో అత్యధికంగా 1,71,465 డాలర్లు
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత తక్కువ జీతభత్యాలు చెల్లించే ఐటీ కంపెనీలున్న 10 దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిల్చింది. మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ నిర్వహించిన ఐటీ శాలరీ 2015 సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం.. దేశీ ఐటీ మేనేజర్ల సగటు వేతనం 41,213 డాలర్లుగా ఉండగా.. ఇదే స్థాయి ఉద్యోగి స్విట్జర్లాండ్‌లో ఇంతకు నాలుగు రెట్లు అధికంగా అందుకుంటున్నారు. అత్యధిక జీతభత్యాలు చెల్లించే ఐటీ కంపెనీలున్న దేశంగా మరోసారి అగ్రస్థానంలో నిల్చిన స్విట్జర్లాండ్‌లో ఐటీ ఉద్యోగి సగటు వార్షిక వేతనం 1,71,465 డాలర్లు కాగా, రెండో స్థానంలో ఉన్న బెల్జియంలో 1,52,430 డాలర్లుగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. 1,38,920 డాలర్లతో డెన్మార్క్ మూడో స్థానంలో నిలవగా.. అమెరికా (1,32,877 డాలర్లు), బ్రిటన్ (1,29,324 డాలర్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానంలో ఉన్నాయి.
ఇక భారతీయ కంపెనీలకన్నా తక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్న దేశాల్లో బల్గేరియా (కేవలం 25,680 డాలర్లు), వియత్నాం (30,938 డాలర్లు), థాయ్‌ల్యాండ్ (34,423 డాలర్లు) ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు మానవ వనరులు చౌకగా లభించే దేశాలకు తరలిపోతున్నాయని మైహైరింగ్‌క్లబ్‌డాట్‌కామ్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. పశ్చిమ యూరప్, అమెరికాలో ఉద్యోగాలు కొన్నే ఉన్నా అవి అధిక నైపుణ్యం అవసరమైనవిగానూ ఉంటున్నాయన్నారు.
అత్యల్ప వేతనాల దేశాలు...
దేశం వార్షిక వేతనం(డాలర్లలో)
బల్గేరియా 25,680
వియత్నాం 30,938
థాయిలాండ్ 34,423
ఇండోనేసియా 34,780
ఫిలిప్పీన్స్ 37,534
భారత్ 41,213
చైనా 42,689
చెక్ రిపబ్లిక్ 43,219
అర్జెంటీనా 51,380
అత్యధిక వేతనాల దేశాలు...
దేశం వార్షిక వేతనం(డాలర్లలో)
స్విట్జర్లాండ్ 1,71,465
బెల్జియం 1,52,430
డెన్మార్క్ 1,38,920
అమెరికా 1,32,877
యూకే 1,29,324