‘జగనన్న అమ్మ ఒడి’తో.. పేదల ఇంట విద్యా క్రాంతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద తల్లుల ఇళ్ల ముంగిటకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం విద్యా సంక్రాంతిని తెచ్చింది. తమ పిల్లల చదువుల కోసం ప్రతీ పేద తల్లికి ఏటా రూ.15వేలు అందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకంపట్ల వారు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక స్థోమతలేని తాము పిల్లలను చదివించుకోవడానికి ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందంటున్నారు. ఈనెల 9న పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి సోమవారం వరకు 41 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని జమచేయించారు. మిగిలిన వారి ఖాతాల్లో మంగళవారం జమచేశారు. ఈ నేపథ్యంలో.. అమ్మఒడి సాయం అందుకున్న తల్లులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమకు ఈ ఏడాది సంక్రాంతి ముందే వచ్చిందంటూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆ తల్లుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
పిల్లల చదువులపై భరోసా వచ్చింది
కూలి పనులు చేసుకుని మిషన్ కుట్టుకుని జీవనం చేస్తున్న మాకు ‘అమ్మ ఒడి’ ద్వారా వచ్చిన డబ్బులతో పిల్లల చదువులకు ఆసరా దొరికినట్లయింది. మా పిల్లలను చదివించుకోగలమన్న భరోసాను ప్రభుత్వం కల్పించింది. జగనన్నకు మేమంతా రుణపడి ఉంటాం.
– చుండూరి కోటేశ్వరమ్మ, కొండెపి, ప్రకాశం జిల్లా
పిల్లల చదువుకు ఆటంకం లేదు
ఆర్థిక స్థోమతలేక పిల్లల చదువులకు నానా అవస్థలు పడుతున్నాం. ఇంతకు మించి మాకు అండ ఇంకేముంటుంది? పిల్లల చదువులకు ఇక ఎలాంటి ఆటంకం ఉండదు. ప్రభుత్వం ఇలా అండగా నిలిస్తే పేద కుటుంబాల్లోని పిల్లలంతా విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తారు.
– షేక్ హసీనా, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా
మా పిల్లల భవిష్యత్తుపై ఇక బెంగలేదు
ఇప్పటివరకు ఏ సీఎం కూడా పిల్లల చదువుకు ఈ విధంగా సాయం చేసిందిలేదు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం చాలా ఉపయోగకరం. మా పిల్లల భవిష్యత్‌పై ఇక మాకు ఎలాంటి బెంగలేదు.
– జి. లక్ష్మి, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా
జగనే ఎప్పటికీ సీఎంగా ఉండాలి
సంక్రాంతి పండుగ వారం ముందే వచ్చిందనిపిస్తోంది. అమ్మ ఒడి సాయంతో మా ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తా. అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైఎస్ జగన్ జీవితకాలం సీఎంగా ఉండాలి.
– వెంకటమహాలక్ష్మి, దేశాయిపేట, ప్రకాశం జిల్లా
సొంత మేనమామలా పిల్లలకు సాయం
మా కష్టాలను తీర్చడానికి ఆ దేవుడు మాకు ఇచ్చిన అన్న సీఎం జగనన్న. సొంత మేనమామలా పిల్లల చదువుల కోసం రూ.15 వేలు ఆర్థిక సహాయం చేశారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలంతా రుణపడి ఉంటారు. ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలి.
– మీరా జాస్మిన్, వట్లూరు, ప.గో.జిల్లా
పిల్లల చదువులు ఇక సాఫీగా..
మా పిల్లల చదువుల కోసం ఏటా రూ.15వేలు ఇచ్చేలా అమ్మ ఒడి పథకాన్ని పెట్టడం, ఈ ఏడాది సాయాన్నీ వెంటనే అందించడం మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. మా పిల్లల చదువులు ఇక సాఫీగా సాగుతాయన్న నమ్మకం ఏర్పడింది. సీఎం వైఎస్ పథకాలు పేదలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయి.
– ఎం. అపర్ణ, వట్లూరు, పశ్చిమగోదావరి జిల్లా
ముందే మా ఇంట సంక్రాంతి
మా పాప చదువు కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలోనే అమ్మఒడి మమ్మల్ని ఆదుకుంది. ఇక మా పాప చదువుకు ఆటంకం ఉండదు. మాకు ఇంత ఆనందాన్ని కలిగించిన సీఎంకు కృతజ్ఞతలు.
– గుత్తుల చంద్ర, రావులపాడు, తూర్పుగోదావరి జిల్లా