వెరీ గూడ్
సంస్కృతంలో బెల్లాన్ని ‘గుడము’ అంటారు.హిందీలో ‘గూడ్’ అంటారు.ఆరోగ్యకరమైన తీపి అంటే బెల్లమే...ఆయుర్వేద గుణాలు ఉన్నది బెల్లానికే...దీపావళి పండుగను స్వచ్ఛమైన బెల్లంతో జరుపుకోండి...
ముఖంలో కాంతులు నింపుకోండి... తియ్యటి వేడుకలతో వెలిగిపొండి...
అనరస
కావలసినవి: బెల్లం పొడి – ఒక కప్పు – (100 గ్రా.); బియ్యప్పిండి – 150 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి మూడు రోజుల పాటు నానబెట్టాలి (ప్రతిరోజూ రెండు సార్లు నీళ్లు మార్చాలి) ∙నాలుగో రోజు నీళ్లన్నీ శుభ్రంగా ఒంపేసి, ఒక పొడి వస్త్రం మీద బియ్యాన్ని నాలుగు గంటలసేపు ఆరబోయాలి ∙ఆరబోసిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙మిక్సీ పట్టిన పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, బెల్లం పొడి జత చేసి చలిమిడిలా అయ్యేలా బాగా కలిపి, మూత పెట్టి 12 గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో అరిసె మాదిరిగా ఒత్తాలి ∙పైన గసగసాలు కాని నువ్వులు కాని ఒత్తాలి ∙ఇలా అన్నిటినీ ఒత్తుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగిన తరవాత ఒత్తి ఉంచుకున్న అనరసలను వేసి వేయించి తీసేయాలి ∙వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు.
కంచ గోలా
కావలసినవి: పనీర్ – ఒక కప్పు; బెల్లం పొడి – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీస్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పిస్తా తరుగు – 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙ముందుగా పాలను విరగ్గొట్టి, గట్టి పనీర్ తయారుచేసుకోవాలి (ఒక్క చుక్క నీరు కూడా లేకుండా గట్టిగా పిండి తీసేయాలి) ∙పనీర్‌ను ఒక పాత్రలోకి తీసుకుని చేతితో సుమారు పావు గంట సేపు బాగా కలపాలి ∙(కొద్దిగా తడి ఉందనిపిస్తే, స్టౌ మీద బాణలిలో వేసి కొద్దిసేపు ఉంచితే తడి పోతుంది) ∙పనీర్ బాగా చల్లారాక రోజ్ వాటర్, ఏలకుల పొడి, కుంకుమపువ్వు, బెల్లం పొడి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు పన్నెండు సమాన భాగాలుగా చేసి, చేతితో ఒత్తాలి ∙పగుళ్లు లేకుండా చూసుకోవాలి ∙ప్రతి గోలాను పిస్తా తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో సుమారు నాలుగు గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి.
పటిషప్త
కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పాలు – 2 కప్పులు
ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా తురుము / కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను
ఫిల్లింగ్ తయారీ: ∙ఒక పాత్రలో కొబ్బరి తురుము/పచ్చి కోవా తురుము, బెల్లం పొడి వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచాలి ∙(పచ్చి కోవాతో చేస్తుంటే కొద్దిగా పాలు జత చేయాలి) ∙కొద్దిగా ఉడికిన తరవాత ఏలకుల పొడి జత చేయాలి ∙ తీగలా సాగే వరకు సుమారు 20 నిమిషాల పాటు బాగా కలిపి దింపి, చల్లారనివ్వాలి.
పటిషప్త తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙పాలు జత చేసి ఉండలు లేకుండా కలిపి, ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి పల్చగా పరవాలి ∙వెంటనే దాని మీద ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి, రోల్ చేయాలి ∙లేత గోధుమరంగులోకి వచ్చేవరకు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి ∙వీటిని వేడిగా కాని, చల్లగా కాని అందించవచ్చు ∙కండెన్స్డ్ మిల్క్ పోసి అందిస్తే, అందంగాను, రుచిగాను ఉంటుంది.
స్వీట్ సమోసా
కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు (పావు కేజీ); పచ్చి సెనగ పప్పు – అర కప్పు (నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – వేయించడానికి తగినంత
తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ∙ఒక విజిల్ రాగానే మంట తగ్గించి మరో రెండు విజిల్స్ వచ్చాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙బాదం పప్పులు, జీడి పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పూరీల పిండి మాదిరిగా కలిపి, పైన వస్త్రంతో కప్పి, సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి ∙ఉడికించిన సెనగ పప్పులో నీళ్లు ఉంటే వాటిని వడకట్టి తీసేయాలి ∙సెనగ పప్పును మిక్సీలో వేసి కొంచెం పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టి బయటకు తీసేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద పెట్టి వేడయ్యాక ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగ పప్పు పొడి వేసి దోరగా వేయించాక, ఒక పాత్రలోకి తీసుకుని, బాగా చల్లారాక, బెల్లం జత చేసి కలియబెట్టాలి ∙ఆ తరవాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙మైదా పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని పూరీలా ఒత్తి, మధ్యలోకి కట్‌చేయాలి ∙ఒక్కో భాగాన్ని తీసుకుని కోన్ ఆకారంలో చేతితో చేసి, అందులో పచ్చి సెనగ పప్పు మిశ్రమం ఉంచి, సమోసాలాగ మూసేసి పక్కన ఉంచుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ సమోసాలను వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
ఉన్ని యాప్పమ్
కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; కొబ్బరి వేయించడానికి; నూనె – అర టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు
ఉన్నియాçప్పమ్ కోసం: అరటి పండ్లు – 2 ; నల్ల నువ్వులు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – ఒక టీ స్పూను (ఒక్కో గుంటలో)
తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి ∙ముప్పావు కప్పు అరటి పండు గుజ్జు, అర కప్పు బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు తిప్పాలి. (అవసరమనుకుంటే ముప్పావు కప్పు నీళ్లు జత చేయాలి) ∙రవ్వలా వచ్చేవరకు గ్రైండ్ చేయాలి (మరీ మెత్తటి పిండిలా రాకూడదు) ∙పిండిని మరో పాత్రలోకి తీసుకోవాలి.
కొబ్బరి వేయించడానికి: బాణలిని స్టౌ మీద ఉంచి, కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.ఉన్నియాప్పమ్ పిండి తయారీపిండిలో మిగిలిన నూనె, వేయించిన కొబ్బరి ముక్కలు జత చేసి కలపాలి. నల్ల నువ్వులు, జీలకర్ర పొడి, శొంఠి పొడి, బేకింగ్ సోడా జత చేసి మరోమారు బాగా కలపాలి.ఉన్నియాప్పమ్ తయారీఅప్పమ్ వేసే చట్టీ పాన్ (పొంగడం మౌల్డ్లా ఉంటుంది) స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. ఒక్కో గుంటలోను ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి, మంట బాగా తగ్గించాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్‌తో పిండి మిశ్రమం ఒక్కో గుంటలో మూడు వంతుల వరకు వేసి, సన్నటి మంట మీద ఉన్నియప్పమ్ బంగారు రంగులోకి వచ్చేవరకు ఉడికించాలి. రెండో వైపు తిప్పి మరి కాస్త నెయ్యి వేసి ఉడికించి దింపేయాలి. వీటిని వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల దాకా ఉంటాయి.
గూడ్ కీ రోటీ
కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – అర కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – చిటికెడు
తయారీ: ∙ఒకపాత్రలో అర కప్పు పాలు, బెల్లం పొడి వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి ∙పాలు + బెల్లం మిశ్రమం జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి (అవసరమనుకుంటే మరి కొన్ని పాలు జత చేయాలి) ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి ∙ఒక్కో ఉండను పావు అంగుళం మందంగా చపాతీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి, తయారుచేసి ఉంచుకున్న గుర్ కీ రోటీ వేసి, సన్నని మంట మీద బాగా కాల్చాలి ∙ రోటీ చుట్టూ నెయ్యి వేయాలి ∙రోటీ మీద కొద్దిగా నెయ్యి పూసి, రోటీని తిరగేసి మళ్లీ నెయ్యి వేసి బాగా కాలాక తీసేయాలి ∙ఈ రోటీలను వేడివేడిగా కాని చల్లగా కాని అందించాలి.
గూడ్ కీ కుల్ఫీ
కావలసినవి: జీడి పప్పులు – 50 గ్రా. (చిన్న చిన్న ముక్కలు చేయాలి); చిక్కటి పాలు – ఒక లీటరు; మిల్క్ మెయిడ్ – ఒక క్యాన్ (410 గ్రా.); ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 100 గ్రా.; పంచదార పొడి – 50 గ్రా; ఉప్పు – చిటికెడు
తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి చల్లారనివ్వాలి ∙ఒక పెద్ద పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్క్, ఏలకుల పొడి వేసి, మీడియం మంట మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిపేయ్యాక మంట సిమ్ చేసి, సుమారు గంటన్నర సేపు అలానే ఉంచాలి ∙మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బెల్లం పొడి వేసి కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి, సుమారు పది నిమిషాలు ఉంచాలి ∙అడుగు అంటకుండా జాగ్రత్తపడాలి ∙జీడిపప్పు పలుకులు వేసి మరోమారు కలిపి దింపేయాలి ∙బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్‌లో మూడు వంతుల వరకు పోసి, ఫ్రిజ్‌లో ఒక రోజు రాత్రంతా ఉంచాలి ∙ సర్వ్ చేయడానికి ఐదు నిమిషాల ముందర ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి పైన మరికొన్ని జీడిపప్పు పలుకులు వేసి అందించాలి.