కాసుల వేట
ఖాళీ స్థలాలపై పోర్టు దృష్టి
ఐటి, వాణిజ్య అవసరాలకు కేటాయించేందుకు ఏర్పాట్లు
జీవీఎంసీ పరిధిలో 40 ఎకరాలు అభివృద్ధి
కన్సల్టెన్సీలకు బాధ్యతలు
విశాఖపట్నం : ఆదాయం కోసం విశాఖ పోర్టు మరో మార్గాన్ని అన్వేషించింది. ఖాళీగా ఉన్న తన స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది. జీవీఎంసీ పరిధిలోని దాదాపు 40 ఎకరాల స్థలాలను ఇప్పటికే గుర్తించింది. వీటిని వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు కేటాయించాలని యోచిస్తోంది. ఈ స్థలాలద్వారా ఎలా ఎంత ఆదాయాన్ని రాబట్టవచ్చో తెలిపే బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించాలని భావి స్తోంది. కోట్లాది రూపాయల ఎగుమతి, దిగుమతుల ఆదాయం సమకూర్చుకుంటూ అంతే స్థాయిలో విస్తరణ చేపడుతున్న పోర్టు అదనపు ఆదాయం కోసం వెతుకులాటలో పడింది. పోర్టు హార్బర్ పార్క్, సాలగ్రామపురంలోని ఖాళీ స్థలాలను వాణిజ్య సముదాయాలకు అప్పగించాలని భావిస్తోంది. ఇందులో కొన్ని ప్రదేశాలను ఐటి టవర్స్‌కు ఇవ్వనుంది. ప్రస్తుతం మేజర్ పోర్టు 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. వీటితో పాటు నర్శింహనగర్ సమీపంలోని సాలగ్రామపురంలో దాదాపు 40 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటిని వాణిజ్య అవసరాలకు ఏ విధంగా వినియోగించవచ్చునో తెలిపేం దుకు పోర్టు అధికారులు కన్సల్టెన్సీని సంప్రదిస్తున్నారు. వ్యాపార,వాణిజ్య, సాంకేతిక అంశాలను అధ్యయనం చేసి ఈ కన్సల్టెన్సీ నివేదిక ఇవ్వనుంది.
ఈ స్థలాల్లో ప్రారంభించే వ్యాపారానికి ఎంత ఖర్చవుతుంది. పెట్టుబడులు ఎంత వేగంగా వెనక్కు వస్తాయో కూడా ఆలోచించి, అలాంటి వ్యాపారం ఏది పెడితే బాగుంటుందనే సలహాను కూడా ఈ కన్సల్టెన్సీ నుంచి తీసుకోనున్నారు. నగరానికి ఈ స్థలాలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆలోచించి ఐటి టవర్స్ లేదా వాణిజ్య సముదాయాలకు కేటాయించాలనుకుంటున్నారు. దీనివల్ల ఇటు పోర్టు కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. పబ్లిక్, ప్రైవేట్ బాఘస్వామ్యం(పిపిపి) పద్థతిలో ఈ అభివృద్ధి చేపట్టనున్నట్లు పోర్టు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం విశాఖ నగరంలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగే అతి తక్కువ ఐటి సంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల కొన్నిటికి అనుమతులు అభించినా అవి నగరానికి దూరంగా నెలకొల్పుకోవాల్సిన పరిస్థితి రావడంతో పెట్టుబడి దారులు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో నగరం నడిబొడ్డున ఉన్న పోర్టు స్థలాలు అందుబాటులోకి వస్తే ఐటి సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని పోర్టు భావిస్తోంది. రానున్న మూడేల్లలో భారీ విస్తరణ ప్రణాళికలు వేసిన పోర్టుకు ఆదాయం ఇప్పుడు అత్యంత అవసరంగా మారింది.