‘రాజీవ్’ సాక్షిగా దీక్ష
► కాంగ్రెస్‌లో మళ్లీ వివాదం
► అధ్యక్షుడికి వ్యతిరేకత
► చర్యలు తప్పదన్న తిరునావుక్కరసర్
రాహుల్ హిత బోధచేసినా, తామింతే అని కాంగ్రెస్ వర్గాలు చాటుకుంటున్నాయి. ఆ పార్టీ పదవుల పందేరం వివాదానికి దారితీసింది. ఉద్వాసనకు గురైన జిల్లాల అధ్యక్షులు రాజీవ్ స్మారక కేంద్రం వద్ద ఆదివారం దీక్ష నిర్వహించారు. అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌కు వ్యతిరేకంగా నినదించారు. కాగా దీక్ష చేపట్టిన వారిపై చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఢిల్లీ పెద్దలు తీవ్ర కుస్తీలు పడుతున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల మూడో తేదీ చెన్నైలో రెండు రోజుల పాటు పర్యటించారు. కాంగ్రెస్ వర్గాలను పిలిపించి ఐక్యతా ఉపదేశం కూడా చేశారు. ఐక్యమత్యమే మహాబలం అని, కుమ్ములాటలు, గ్రూపులు వద్దు అని హితవు పలికారు.
తామంతా, ఒకటే అన్నట్టుగా ఆ సమయంలో నేతలు వ్యవహరించినా, తదుపరి వెలువడ్డ జిల్లా అధ్యక్షుల జాబితా వివాదానికి దారితీసింది. తన ఆధిపత్యాన్ని చాటుకునే విధంగా అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పావులు కదిపారు. మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఈ జాబితాలో పెద్ద షాకే తగిలింది. ఆయన మద్దతుదారులందరికీ ఉద్వాసన పలికారు. దీంతో గ్రూపు వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా తొలగింపునకు గురైన అధ్యక్షుడు దివంగత రాజీవ్ గాంధీ స్మారక ప్రదేశం శ్రీ పెరంబదూరు సాక్షిగా దీక్ష చేపట్టడంతో ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని కాంగ్రెస్‌లో ఉత్కంఠ బయలు దేరింది.
మాజీల దీక్ష
తొలగింపునకు గురైన 20 జిల్లాలకు చెందిన అధ్యక్షుడు త్యాగ భూమిగా పేరు గడించిన రాజీవ్‌స్మారక ప్రదేశం శ్రీ పెరంబదూరులో ఆదివారం దీక్ష నిర్వహించారు. తమ గోడును వెల్లబోసుకుంటున్నట్టు, అధ్యక్షుడి తీరుపై శివాలెత్తారు. పార్టీని సర్వనాశనం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు కంకణం కట్టుకుని ఉన్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.ఈ నిరసనలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు.
రాజీవ్ గాంధీ మరణించిన ఈ త్యాగ భూమి నుంచి బయలుదేరిన నిరసన, రాష్ట్రవ్యాప్తంగా రగలడం ఖాయం అని హెచ్చరించారు. ఇక, దీక్ష చేస్తూ, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ వీరిపై వేటుకు తిరునావుక్కరసర్ కసరత్తుల్లో పడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, త్యాగ భూమిలో వివాదం రేపుతున్నారంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, శాశ్వత ఉద్వాసన తప్పదంటూ తిరునావుక్కరసర్ హెచ్చరికలు జారీ చేశారు.