నామినేటెడ్‌పై టీఆర్ఎస్ నేతల దృష్టి
జిల్లా నుంచి ఆశావహులు అధికం
రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులపైనా గురి
సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తులు..
మంత్రుల సిఫారసులు..
వరంగల్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ కార్యదర్శి పోస్టుల భర్తీ పూర్తరుుంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల కోసం టీఆర్ఎస్ ముఖ్యనేతలు, సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాని వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికివారు తమ అర్హతలను, పార్టీకి చేసిన సేవలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు విన్నవించుకుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో తమ అర్హతలను టీఆర్ఎస్ అధినేతకు తెలిసేలా చేస్తున్నారు. మొత్తంగా టీఆర్ఎస్లోని ముఖ్యనేతలు నామినేటెడ్ పదవులే లక్ష్యంగా చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. కాగా, తెలంగాణ పోరులో, టీఆర్ఎస్ పరంగా జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గంలో జిల్లాకు కీలకమైన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ పదవులు దక్కాయి. రాష్ట్రంలోనే ముఖ్యమైన స్పీకర్ పదవి వచ్చింది. నామినేటెడ్‌కు సంబంధించి.. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వ ప్రతినిధి వంటివి వచ్చాయి. ఇదే కోవలో.. మరిన్ని రాష్ట్ర స్థాయి పదవులు తమకు వస్తాయని జిల్లా నేతలు భావిస్తున్నారు.
పోటా పోటీ
వరంగల్-నల్లగొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందనే అంశంపై జిల్లాలోని ముఖ్యనేతలకు వచ్చే పదవులపై స్పష్టత రానుంది. నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి ఈ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో బండ నరేందర్‌రెడ్డికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్లో పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పెరగనున్నాయి. వీటిలో జిల్లాలోనే ఒకటి ఉండనుంది. ఈ లెక్కన జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఉండనున్నాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత నాగుర్ల వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడనున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని కొండా సురేఖకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే పదవుల పంపకంలో సమీకరణలు మారే అవకాశం ఉంది.
పదవులపై ఆశలు
మర్రి యాదవరెడ్డికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కని నేపథ్యంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కె.వాసుదేవారెడ్డి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు టీఆర్ఎస్ సాధారణ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు టిక్కెట్లు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి ధీటుగా ఉద్యమం నడిపిన నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను టీఆర్ఎస్ అధినేత పరిశీలిస్తున్నట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అతి పెద్ద మార్కెట్‌గా వరంగల్(ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్ ఉంది. ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పదవి త్వరలో ఖాళీ కాబోతోంది. టీఆర్ఎస్ జిల్లా నేతలు పలువురు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు పేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి వినిపిస్తోంది. ఏనుమాముల ప్రాంతం ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు ఈ మార్కెట్ పరిధిలోనే ఉన్నాయి. నలుగురు ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ పదవిని టీఆర్ఎస్ జిల్లా నేతల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని మరో ప్రధానమైన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డికి ఇస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నూకల నరేశ్‌రెడ్డి, గుడిమల్ల రవికుమార్, లింగంపెల్లి కిషన్‌రావు, మేడిపెల్లి శోభన్‌బాబు, లలితాయాదవ్, నయీముద్దిన్లకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.