post metric scholarships
-
ఉపకార వేతనాల దరఖాస్తులను అందజేయండి
సాక్షి,సిటీబ్యూరో: పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుల హార్డ్ కాపీలను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు వెంటనే జిల్లా ఎస్సీ సంక్షేమాధికారికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరు, విద్యార్థుల దరఖాస్తుల సమర్పించడంలో జరుగుతున్న జాప్యం పై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, వృత్తి విద్య కోర్సులు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులను వసతి గృహ అధికారులు ఈ నెల 28 లోగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ప్రతి షెడ్యూల్ కులాల విద్యార్థిచే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓలు, ఏఎస్ఓలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
‘ఉపకార’ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 24వ తేదీతో గడువు ముగియగా.. 10 శాతం మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. దీంతో గడువు పెంపు అనివార్యమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని సంక్షేమ శాఖలు పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫలితంగా డిసెంబర్ 31వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఏర్పడింది. -
ఫస్ట్..ఫాస్ట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం ఫస్ట్ కమ్ ఫాస్ట్ అనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటివరకు సీనియర్ విద్యార్థుల ఫీజులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తున్నప్పటికీ అందుబాటులోని నిధులు చాలక కొన్ని కాలేజీలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీన్ని అధిగమించేందుకు నిధుల మంజూరులో సంస్కరణలు చేపట్టింది. ఇకపై ఆన్లైన్లో నమోదు చేసుకున్న విద్యార్థుల అర్జీలను పూర్తిగా పరిశీలించాక సంక్షేమ శాఖలకు ముందు సమర్పించే కాలేజీలకు తొలుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. వెబ్సైట్లో మార్పులు: ఫస్ట్ కమ్ ఫాస్ట్ విధానం కోసం ఈ–పాస్ వెబ్సైట్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. గత వారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) బృందంతో సంక్షేమ శాఖలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో నిబంధనలను ప్రస్తావించిన అధికారులు... ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని సీజీజీకి సూచించారు. ప్రస్తుతం ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ దరఖాస్తులన్నీ ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల దరఖాస్తులను తొలుత కాలేజీలు పరిశీలించి ఆపై వాటిని సంక్షేమ శాఖకు ఆన్లైన్లో సమర్పించడంతోపాటు మ్యాన్యువల్ దర ఖాస్తులను సంక్షేమ శాఖకు పంపుతున్నాయి. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తోందనే ఉద్దేశంతో దరఖాస్తుల పరిశీలనపై కాలేజీ యాజమాన్యాలు శ్రద్ధ చూపట్లేదు. దీంతో కాలేజీల మధ్య పోటీ పెంచడంతోపాటు దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేసేందుకు ఫస్ట్ కమ్ ఫాస్ట్‌ను తీసుకొచ్చారు. దరఖాస్తులను ఏ కాలేజీ ముందు పంపించిందనే విషయం ఈ–పాస్ వెబ్సైట్లో కనిపించేలా సీజీజీ రైడర్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో దరఖాస్తులు సమర్పించిన కాలేజీ సమ యం క్షణాలతో సహా కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అధికారులు ఆయా కాలేజీలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేస్తారు. ముందుగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు... ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా చెల్లింపులు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు.. 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 30తో దర ఖాస్తు గడువు ముగియనుంది. జనవరి నెలాఖరు వరకు పాత బకాయిల చెల్లింపుల్లో సంక్షేమ శాఖలు తలమునకలయ్యాయి. జనవరి 31 నాటికి 2013–14 నుంచి 2017–18 వరకున్న పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలు వేగం చేశారు. -
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కేంద్రమే ఇవ్వాలి
కేంద్ర మంత్రికి చంద్రబాబు వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్‌లోని విద్యార్థులకు ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను నూటికి నూరు శాతం కేంద్రం చెల్లించాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవార్చంద్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో తమకు పూర్తి సాయం అందించాలని ఆయన కోరారు. ఈ పథకం కింద తాము రూ. 700 కోట్లు చెల్లిస్తుంటే, కేంద్రం రూ. 300 కోట్లు మాత్రమే తమకు సాయంగా అందిస్తోందని, మిగిలిన మొత్తాన్ని కూడా కేంద్రం భరించాలని కోరారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే పథకం కింద తాము 3,238 మంది విద్యార్థులకు సాయం అందిస్తుంటే కేంద్ర మాత్రం 176 మందికి మాత్రమే నిధులు చెల్లిస్తోందని, ఆ సంఖ్యను పెంచాలని కోరారు. తాము నూతనంగా ఏర్పాటు చేస్తున్న వృద్ధాశ్రమాలతో పాటు ఎస్సీల సంక్షేమానికి తగినంత సాయం చేయాల్సిందిగా కోరగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైన కంభంపాటి రామ్మోహనరావు పాల్గొన్నారు.