ఫస్ట్‌..ఫాస్ట్‌! | New Clause In Fee Grants By Telangana Government | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌..ఫాస్ట్‌!

Published Mon, Dec 16 2019 1:18 AM | Last Updated on Mon, Dec 16 2019 1:18 AM

New Clause In Fee Grants By Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో ప్రభుత్వం ఫస్ట్‌ కమ్‌ ఫాస్ట్‌ అనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటివరకు సీనియర్‌ విద్యార్థుల ఫీజులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తున్నప్పటికీ అందుబాటులోని నిధులు చాలక కొన్ని కాలేజీలకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీన్ని అధిగమించేందుకు నిధుల మంజూరులో సంస్కరణలు చేపట్టింది. ఇకపై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న విద్యార్థుల అర్జీలను పూర్తిగా పరిశీలించాక సంక్షేమ శాఖలకు ముందు సమర్పించే కాలేజీలకు తొలుత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది.

వెబ్‌సైట్‌లో మార్పులు: ఫస్ట్‌ కమ్‌ ఫాస్ట్‌ విధానం కోసం ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. గత వారం సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) బృందంతో సంక్షేమ శాఖలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో నిబంధనలను ప్రస్తావించిన అధికారులు... ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని సీజీజీకి సూచించారు. ప్రస్తుతం ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులన్నీ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల దరఖాస్తులను తొలుత కాలేజీలు పరిశీలించి ఆపై వాటిని సంక్షేమ శాఖకు ఆన్‌లైన్‌లో సమర్పించడంతోపాటు మ్యాన్యువల్‌ దర ఖాస్తులను సంక్షేమ శాఖకు పంపుతున్నాయి.

ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తోందనే ఉద్దేశంతో దరఖాస్తుల పరిశీలనపై కాలేజీ యాజమాన్యాలు శ్రద్ధ చూపట్లేదు. దీంతో కాలేజీల మధ్య పోటీ పెంచడంతోపాటు దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేసేందుకు ఫస్ట్‌ కమ్‌ ఫాస్ట్‌ను తీసుకొచ్చారు. దరఖాస్తులను ఏ కాలేజీ ముందు పంపించిందనే విషయం ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో కనిపించేలా సీజీజీ రైడర్స్‌ను ఏర్పాటు చేసింది. దీంతో దరఖాస్తులు సమర్పించిన కాలేజీ సమ యం క్షణాలతో సహా కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే అధికారులు ఆయా కాలేజీలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేస్తారు. ముందుగా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు... ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా చెల్లింపులు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

ఈ నెల 30 వరకు దరఖాస్తు గడువు..
2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 30తో దర ఖాస్తు గడువు ముగియనుంది. జనవరి నెలాఖరు వరకు పాత బకాయిల చెల్లింపుల్లో సంక్షేమ శాఖలు తలమునకలయ్యాయి. జనవరి 31 నాటికి 2013–14 నుంచి 2017–18 వరకున్న పెండింగ్‌ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలు వేగం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement