మార్చిలోగా ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలు
అమరావతి: రాష్ట్రంలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం షెడ్యుల్‌ను ప్రకటించింది. ఇప్పటికే తుది రాత పరీక్షలు పూర్తి చేసుకుని మెరిట్ లిస్ట్‌ను ప్రకటించిన ఆయా పోస్టుల భర్తీని చేపట్టనున్నట్టు తెలిపింది. గత ఏడాది నవంబర్ 18, 19 తేదీల్లో తుదిరాత పరీక్ష నిర్వహించిన ఎస్సై (కమ్యూనికేషన్స్), ఏఎస్సై (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టుల మెరిట్ లిస్ట్‌ను ఈ నెల 10న ప్రకటించ నుంది. జనవరి 29న రాత పరీక్ష నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్స్) పోస్టులకు ఫిబ్రవరి 20న సెలక్షన్ లిస్ట్ విడుదల కానుంది.
ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్లను మార్చి 20 నుంచి శిక్షణకు పంపించనున్నారు. గత నెల 22న పరీక్ష నిర్వహించిన కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్, వార్డెన్) పోస్టులకు ఫిబ్రవరి 27న మెరిట్ లిస్ట్ వెల్లడిస్తారు. ఎస్సై (సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఎస్ఏఆర్సీపీఎల్, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మెట్రిన్) పోస్టులకు ఈ నెల 18, 19 తేదీల్లో తుది రాతపరీక్షలు జరపి మార్చి 20న మెరిట్‌లిస్ట్ ప్రకటిస్తారు. పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్, మెకానిక్) పోస్టులకు మార్చి రెండో వారంలో తుది పరీక్ష జరిపినెలాఖరులో ఎంపిక జాబితాను ప్రకటించనున్నారు.