గిరిజనుల గోడు పట్టదా?
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘ఓట్లు.. సీట్ల.. కోసం ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి.. కుర్చీల కుమ్ములాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూరుకుపోయాయి.. కానీ గిరిజనుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, దళితులు, పేదల సమస్యలను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు’ అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. తరతరాలుగా ఆదివాసీ గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు బృందాకారత్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
మూడేళ్లుగా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూర్చుని తమ పదవులను కాపాడుకోవడంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 33లక్షల ఎకరాల భూమికి గిరిజన పట్టాలు అందించాల్సి ఉండగా, వీటిని కేవలం 19 లక్షలకు కుదించారని, ఇందులో 4.5లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారని విమర్శించారు. అర్హులైన గిరిజనుల దరఖాస్తులను తిరస్కరించి వారి నోటివద్ద ముద్దను లాక్కొనే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పొతినేని సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.