రేణిగుంట విమానాశ్రయానికీ పవర్ కట్
రేణిగుంట, న్యూస్‌లైన్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా భారీగా విద్యుత్ ఉత్పత్తి నిలచిపోవడంతో రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం పవర్ కట్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఎయిర్‌పోర్టు ఫీడర్‌కు సరఫరా నిలిపివేశారు. తిరిగి 12 గంటలలోపు రెండుసార్లుగా గంటపాటు విద్యుత్ ఇచ్చి తీసేశారు. మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 7.40 గంటల వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా రేణిగుంట చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం, పూణే నుంచి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 4 గంటలకు రేణిగుంటకు చేరుకున్న జెట్‌లైట్ విమానం, హైదరాబాద్ నుంచి సాయంత్రం 5.50 గంటలకు రేణిగుంటకు చేరుకున్న స్పైస్‌జెట్ విమానాల రాకపోకలను ఎయిర్‌పోర్టు డెరైక్టర్ పట్టాభి పర్యవేక్షణలో బ్యాటరీ పవర్ సిస్టమ్‌తో సజావుగా సాగించారు. మరో రెండు రోజులు పవర్‌కట్ ఇలానే ఉన్నా విమానాల రాకపోకలకు అంతరాయం ఉండదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.