ఇక అంధకారమే!
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమాన్ని విద్యుత్ ఉద్యోగులు తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు నిరాహారదీక్షలు, ర్యాలీలు, పెన్‌డౌన్‌లు, ధర్నాలకే పరిమితమైన విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు పూర్తిగా విధులను బహిష్కరించనున్నారు. దీంతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తం కానుంది. జిల్లాలో ఆయా డివిజన్లలోని డీఈలు విద్యుత్ భవన్లో ఎస్ఈ నందకుమార్‌ను బుధవారం కలిసి సిమ్‌కార్డులను వెనక్కి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఈ నుంచి డీఈ వరకు సెల్ఫోన్లు పని చేయవు. నేడో రేపో జిల్లాలో పని చేస్తున్న దాదాపు 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు కూడా విధులకు దూరం కానున్నట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే జిల్లా అంధకారంగా మారునుంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విద్యుత్ సంస్థలోని 13 సంఘాలు ఏకమై గడచిన 30 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నాయి. ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులు, అధికారులు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలైన రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు, శ్రీశైలం, నాగార్జునసాగర్, వీటీపీఎస్, సింహాద్రి తదితర ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. భవిష్యత్తులో విద్యుత్ పరంగా మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.