power department Corruption
-
కరెంటు పనుల్లో అక్రమాలు!
చిత్రంలో ఆటోలో మధ్యన కూర్చున్న కూలీ పేరు శంకర్. ఇతనిది ఖమ్మం. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్‌చౌక్‌లో రోడ్డు విస్తరణలో భాగంగా కరెంటు స్తంభాలను జరిపి రోడ్డుకు కొంతదూరంగా వేసి దానికి కండక్టర్ బిగిస్తుండగా మంగళవారం విద్యుత్ ఘాతానికి గురై కొద్దిలో చావుతప్పి గాయాలతో బయట పడ్డాడు. సాధారణంగా కరెంటు పనులు చేసేటప్పుడు సరఫరా నిలిపివేస్తారు. అయితే ఈ కూలీ హెచ్‌టీ కరెంటు పనులు చేస్తుండగా కింద ఉన్న ఎల్టీ కరెంటుకు కండక్టర్ తగలడంతో విద్యుత్ ఘాతానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పనులు శాఖల మధ్య ఒక ఒప్పందంతో జరుగుతున్నవి కావు. అలాంటప్పుడు ఈ పనులకు ఎల్సీ ఇచ్చిందెవరు? అనధికారికంగా పనులు చేస్తే విద్యుత్ ఘాతానికి గురైన కూలీలు మృతిచెందితే ఎవరు బాధ్యులు అనే ప్రశ్న తలెత్తుతోంది. సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్పత్రి నుంచి తిర్పెల్లి వరకు నాలుగు వరుసలుగా ఉన్న పాత ఎన్‌హెచ్ రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్‌టీ కరెంటు స్తంభాలను తొలగించి టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల స్తంభాలనే ఉంచి మిగతా చోట్ల టవర్లు ఏర్పాటు చేసి వాటినుంచి కండక్టర్ (వైరు) లాగుతున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ పనులు కలిపి మొత్తం రూ.44.03 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ఈ పనులు చేపడుతోంది. ఇక్కడివరకు వ్యవహారం సజావుగానే ఉంది. అయితే విద్యుత్ స్తంభాల తొలగింపు, టవర్ల ఏర్పాటువంటి పనులకు పైన పేర్కొన్న నిధుల్లోంచే రూ.3 కోట్లతో ప్రత్యేకంగా పనులు చేపడుతున్నారు. ఇక్కడే అవినీతికి తెరలేచింది. ఆర్‌అండ్‌బీశాఖ పనులు చేపడుతుండగా విద్యుత్‌శాఖకు 10శాతం నిధులను నిర్మాణ ఖర్చుల కింద చెల్లించి చేపట్టాలి. ఇక్కడ ఇరు శాఖల అధికారులు ఒక ఒప్పందం చేసుకొని విద్యుత్‌శాఖ ఆదాయానికి గండిపెట్టి తమ జేబులు నింపుకునేలా అనధికారికంగా పనులు చేపడుతున్నారు. పైగా విద్యుత్‌శాఖ డీఈ ఈ పనులకు సంబంధించి ఆర్అండ్బీ నుంచి ఎంబీ రికార్డు చేసి కార్పొరేట్ ఆఫీసుకు నిధులు నేరుగా పంపిస్తారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా పది శాతం నిధులు, విద్యుత్ అంతరాయానికి సంబంధించిన మొత్తం కలిపి విద్యుత్‌శాఖ ఎస్ఈ ద్వారా ఒప్పందం చేసుకొని చెల్లింపులు జరిపిన తర్వాతే ఈ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అక్రమం ఇలా.. రూ.3 కోట్ల ఈ కరెంటు పనుల్లో విద్యుత్‌శాఖకు ఆర్అండ్బీ 10శాతం నిర్మాణ ఖర్చుల కింద చెల్లించాలి. ఈ లెక్కన రూ.30లక్షలు ఆ శాఖకు చెల్లించాలి. అదేవిధంగా పనులు జరిగే సమయంలో కరెంటు అంతరాయానికి సంబంధించి ఎంతైతే విద్యుత్‌శాఖకు నష్టం చేకూరుతుందో అంత పనులు చేపట్టే వారినుంచి వసూలు చేయాలి. దీనికి సంబంధించి ముందుగా ఆర్అండ్బీ నుంచి విద్యుత్‌శాఖకు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించి అంచనా వ్యయం రూపొందించి ఆ వ్యయాన్ని డిమాండ్ నోటీసు ద్వారా పంపిస్తారు. దానికి బదులుగా ఆర్అండ్బీ శాఖ ఈ మొత్తాన్ని చెల్లించి ఒక ఒప్పందం చేసుకొని అప్పుడు పనులు చేపట్టాలి. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న స్తంభాల తొలగింపు, టవర్ల బిగింపు పనులు ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరుశాఖల అధికారుల మధ్య రహస్య ఒప్పందంతో అక్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. తద్వారా లక్షల రూపాయలు ఇరుశాఖల అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఎల్సీ దోపిడీ.. కరెంటు పనులు అధికారికంగా చేపడుతున్నప్పుడు సంబంధిత విద్యుత్ శాఖాధికారులు లైన్ క్లియర్ (ఎల్సీ) జారీ చేసి ఎన్ని గంటల పాటైతే పనులు చేపడతారో ఆ కరెంటు అంతరాయానికి సంబంధించి వ్యయాన్ని లెక్కగట్టి పనులు చేపడుతున్న వారి నుంచి కట్టిపించుకోవాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇలాగే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్తంభాలను జరిపి టవర్లను బిగించారు. అయితే ఆదిలాబాద్‌లో జరిగే పనికంటే నిర్మల్‌లో జరిగిన ఆ అభివృద్ధి పని 50 శాతమే. అందులో పనులు జరుగుతున్నప్పుడు అక్కడ ఒక సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేసినందుకు పనులు చేపట్టిన శాఖ నుంచి రూ.18లక్షలు విద్యుత్ శాఖకు చెల్లించారు. ఆదిలాబాద్‌లో జరుగుతున్న పనిలో భుక్తాపూర్, ఖానాపూర్, దస్నాపూర్ మూడు సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి చేపడుతున్నారు. అంతేకాకుండా ఎడాపెడ రోజంతా కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఈ లెక్కన కరెంటు అంతరాయం కింద ఆర్అండ్బీ శాఖ సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వరకు చెల్లించాల్సి వచ్చేదని కొంతమంది విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఈ పనులు అనధికారికంగా జరుగుతుండడంతో ఇప్పుడీ డబ్బులన్ని ఇరుశాఖల అధికారులు ఒక ఒప్పందం ప్రకారం అక్రమ పద్ధతిలో స్వాహా చేయడం ఖాయమని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌లో జరుగుతున్న పనులకు సంబంధించి అసలు ఎంత మొత్తం, ఎలా జరుగుతున్నాయనే వివరాలు అధికారుల వద్ద చెప్పేందుకు లేవు. జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, ఆదిలాబాద్ శివారు ఖానాపూర్‌లోనూ ఇలాంటి పనులే జరగగా, అవికూడా ఒప్పందం లేకుండానే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీఎండీ దృష్టి సారించి అధికారుల అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎండీ దృష్టి పడేనా.. టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. విద్యుత్ శాఖాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఆదిలాబాద్ పట్టణంతోపాటు జిల్లాలో రోడ్డు విస్తరణలో భాగంగా కరెంటు పనులన్నీ ఆర్అండ్బీ, విద్యుత్ శాఖల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుండానే యథేచ్ఛగా జరుగుతున్నాయి. సీఎండీ ఇలాంటి అక్రమాలపై దృష్టి సారిస్తేనే విద్యుత్‌శాఖకు ఆదాయం, పనులు చేస్తున్న కూలీలకు భద్రత ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ ఎస్ఈ పర్యవేక్షణలో ఈ పనులు జరగాల్సి ఉండగా, ఆయన వివరణను ‘సాక్షి’ కోరినప్పుడు ఈ పనులపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఆదిలాబాద్ డీఈఓ ఈ పనులు చూస్తున్నారని చెప్పడం గమనార్హం. అంచనా వ్యయం రూపొందించాం ఆదిలాబాద్‌లో రహదారి విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలను జరిపి, టవర్లు నిర్మించే పనులు చేపడుతున్నాం. వీటి అంచనా వ్యయాలను ఇదివరకే రూపొందించాం. అయితే ఆర్అండ్బీ నుంచి మాత్రం చెల్లింపులు జరగలేదు. వారి పనులకు సంబంధించి మెజర్మెంట్ బుక్ (ఎంబీ)లో నమోదు చేసి పైకి పంపిస్తారు. అక్కడి నుంచి విద్యుత్‌శాఖకు చెల్లింపులు జరుపుతారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు. – సుభాష్, విద్యుత్‌శాఖ డీఈ -
విద్యుత్ అవినీతిపై సీబీఐకి సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు శాఖలో అవినీతి, అక్రమాలు, దుబారాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు, సీబీఐ విచారణకు సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. పీపీఏల్లో లొసుగులు, లోపాలపై ఆధారాలు అందజేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమాధానం చెప్పించడం కాదని, దమ్ముంటే ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు సిద్ధమని ప్రభాకర్‌రావు చెప్పారని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్తు సంస్థలో రూ.8వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని, మరో రూ.10వేల కోట్లకు పైగా నష్టంవాటిల్లిందని, ఇదీ ముమ్మాటికి నిజమన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతరాలకు రూ.7వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్‌కు రూ.1800 కోట్లు, సోలార్ సంస్థలకు రూ.3వేల కోట్లు బకాయి పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల బిల్లులు కట్టకపోతే సర్పంచులను పీకేస్తామని అంటున్న సీఎంను విద్యుత్తు బకాయిలు చెల్లించనందుకు ఏం చేయాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొనసాగే హక్కు ఉందా? అని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.3.50కే యూనిట్ విద్యుత్తు లభిస్తుంటే ఛత్తీస్‌గఢ్‌తో రూ.4.50కు యూనిట్ చొప్పున ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. సోలార్ విద్యుత్‌లోనూ చేతివాటమే! యూనిట్ సోలార్ విద్యుత్‌ను రూ.4.50 కంటే తక్కువకే కొనుగోలు చేయాలని 2015లో కేంద్రం స్పష్టం చేసిందని, ఒకవేళ బిడ్డింగ్‌లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తే ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’కింద ఎక్కువ మొత్తాన్ని తాము భరిస్తామని కేంద్రం విధానపరమైన నిర్ణయం చేసినా పట్టించుకోకుండా యూనిట్‌కు రూ.5.50 చొప్పున 2వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ పీపీఏలు సంతకాలు చేసే సమయానికి టీటీడీ రూ.4.49లకు, రాజస్తాన్ ప్రభుత్వం రూ.4.34లకు ఒప్పందం చేసుకున్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు ఒక రూపాయి అధికంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకోవడం వల్ల రాష్ట్రానికి రూ.8వేల కోట్ల నష్టంవాటిల్లిందన్నారు. ఇదీ ఛార్జీల రూపంలో ప్రజలపై పడే భారం కాదా? అని ప్రశ్నించారు. -
వీళ్లు ఇక మారరు..
సాక్షి, ఆదిలాబాద్ : విద్యుత్‌శాఖ జూనియర్ లైన్మెన్ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నది వాస్తవం.. విద్యుత్ శాఖాధికారుల ప్రమేయం లేకుండా ఇది జరిగే ప్రక్రియ కాదన్నది కూడా నమ్మలేనిది. గుర్తు తెలియని వ్యక్తి తానే అభ్యర్థిని అని వచ్చి సెలక్షన్ కమిటీ ముందే వీడియో చిత్రీకరణలోనే విద్యుత్ స్తంభం పరీక్షలో పాల్గొని వెళ్లడం.. ఆ తర్వాత సర్టిఫికెట్ల విషయంలో అధికారుల దగ్గరికి వచ్చే వరకు అధికారులకు నకిలీ అభ్యర్థిపై అనుమానం రాలేదంటే వారు ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారా.. లేని పక్షంలో ఆ ప్రక్రియ తామనుకున్నట్టుగా సాగేలా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానం కలగకపోదు. నో చేంజ్.. రాత పరీక్ష తర్వాత మొదటి విడతలో ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో 439 మందికి విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించారు. రెండో విడతలో 184 మంది అభ్యర్థులకు నిర్వహించడం జరిగింది. ఇక గురువారం నుంచి మూడో విడతలో 88 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే రెండో విడత పరీక్షలో అక్రమాలు జరిగాయని తేటతెల్లమైనా దాన్ని అంగీకరించేందుకు టీఎస్ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఇంత జరిగినా సెలక్షన్ కమిటీని యథావిధిగా కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెలక్షన్ కమిటీలో ఆదిలాబాద్ ఎస్ఈ చైర్మన్‌గా, డీఈలు, పీఓ సభ్యులుగా ఉన్నారు. కార్పొరేట్ ఆఫీస్ నుంచి వచ్చే సీజీఎం పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఆయన కనుసన్నల్లోనే ప్రక్రియ సాగుతోంది. కాగా రెండో విడతపై ఇన్ని ఆరోపణలు వచ్చినా అదే సెలక్షన్ కమిటీని మూడో విడతకు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియలో వరంగల్‌లో నిపుణులైన కొంతమంది కార్మికులను నకిలీలుగా తీసుకొనివచ్చి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 439 పోస్టులు.. ఉమ్మడి జిల్లాలో 439 జేఎల్ఎం పోస్టులను భర్తీ చేస్తున్నారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ నుంచి పాత ఐదు సర్కిళ్ల పరిధిలో పోస్టుల ప్రక్రియ జరుగుతుండగా, ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం మూడో విడత విద్యుత్ స్తంభాలు ఎక్కే పరీక్ష కొనసాగుతుంది. రెండో విడతలో నకిలీ అభ్యర్థి పోల్ క్లైమ్ టెస్ట్‌లో పాల్గొనడం కలకలం రేపుతోంది. ఇది నిరుద్యోగ అభ్యర్థుల్లో అనుమానాలకు తావిస్తోంది. మొత్తం ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నారన్న విమర్శలు లేకపోలేదు. మూడో విడతలో 88 మంది అభ్యర్థులకు గురువారం నుంచి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఆదిలాబాద్ చేరుకున్నారు. దీంతో బుధవారం పరీక్ష జరిగే ఎస్ఈ కార్యాలయం ఆవరణలో సందడిగా కనిపించారు. పూర్తి పారదర్శకంగా నియామకాలు జేఎల్ఎం నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నడుస్తుంది. రెండో విడతలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి స్తంభం ఎక్కే పరీక్షలో పాల్గొన్న విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం అది విచారణ చేస్తున్నారు. లోపాలు ఉన్న పక్షంలో మేమే చర్యలు తీసుకుంటాం. అభ్యర్థులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. – ఉత్తం జాడే, విద్యుత్‌శాఖ ఎస్ఈ, ఆదిలాబాద్ -
విద్యుత్ కొను‘గోల్మాల్’ అంతు తేలుద్దాం
సాక్షి, అమరావతి: గాడి తప్పిన విద్యుత్ శాఖను దారిలో పెట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గడచిన ఐదేళ్లుగా ఈ రంగంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై అధికారులు చెప్పిన వివరాలు విని విస్తుబోయారు. ఇందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం విద్యుత్ రంగంపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష జరిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. చౌకగా లభించే థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టారని, దీని వల్ల రూ.2,636 కోట్ల మేర విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్.. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అడ్డగోలు పీపీఏలు జరిగాయని, ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఘోరంగా నష్ట పోయాయని విద్యుత్ అధికారులు తెలిపారు. తక్కువకే జీఎంఆర్ గ్యాస్ విద్యుత్ లభిస్తున్నా, పీపీఏ గడువు ముగిసిన ల్యాంకో, స్పెక్ట్రం నుంచి అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రూ.276 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. ఇన్ని అక్రమాలు జరిగాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి అన్నింటిపైనా వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని స్కాములకు పాల్పడి ప్రభుత్వం చేసిన పీపీఏలపై పునః సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని నియమించిందని, విద్యుత్ రంగంలోని అవినీతిని కూడా సమీక్షిస్తుందని, అన్ని వివరాలు కమిటీ సభ్యులకు ఇవ్వాలని సూచించారు. విండ్, సోలార్ పవర్ ధరలు తగ్గించేందుకు సంప్రదింపుల కమిటీ చర్చలు జరుపుతుందని చెప్పారు. అవినీతిని ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ఇందులో పాత్రధారులైన అధికారులనూ చట్ట ప్రకారం విచారించాలని ఆదేశించారు. అడ్డూ అదుపులేని దోపిడీ చౌకగా థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నా ప్రైవేట్ పవన, సౌర విద్యుత్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా దోచిపెట్టిందో ఇంధన శాఖ సవివరంగా సీఎం ముందుంచింది. వాస్తవానికి మెరిట్ ఆర్డర్ ప్రకారం చౌకగా లభించే విద్యుత్‌కు ముందు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు వివరించారు. ఈ లెక్కన రాష్ట్రానికి కేంద్రం అందించే థర్మల్ విద్యుత్ స్థిర (ఫిక్స్డ్) వ్యయం యూనిట్‌కు రూ.1.10 అని, చర (వేరియబుల్) వ్యయం రూ.3.10 ఉంటుందని, మొత్తం కలిపినా యూనిట్ రూ.4.20కే లభిస్తుందని తెలిపారు. ఇంత తక్కువకు లభించే విద్యుత్‌ను పక్కన పెట్టి యూనిట్ రూ.4.84 చొప్పున పవన విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. అదీ ఏకంగా 5,900 మెగావాట్ల మేర ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్ లేకపోవడం వల్ల విండ్ సోలార్ కోసం థర్మల్ విద్యుత్‌ను నిలిపి వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కారణంగా పీపీఏలున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు యూనిట్‌కు రూ.1.10 స్థిర వ్యయం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విండ్‌కు చెల్లించేది రూ.4.84 అయితే, విండ్ తీసుకోవడం వల్ల థర్మల్‌కు చెల్లించే స్థిర వ్యయం రూ.1.10 కలుపుకుంటే, పవన విద్యుత్ ధర యూనిట్ రూ.5.94 పడుతోందని తెలిపారు. థర్మల్ విద్యుత్ యూనిట్ రూ.4.20కే లభిస్తుంటే పవన విద్యుత్ రూ. 5.94 చొప్పున కొనడం వల్ల యూనిట్‌కు రూ. 1.74 ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. సోలార్కు ఏకంగా యూనిట్‌కు రూ.5 నుంచి రూ.6 చెల్లించారని సీఎంకు వివరించారు. యూనిట్ రూ.5 సోలార్కు ఇచ్చి, థర్మల్ స్థిర వ్యయం రూ.1.10 ఇస్తే అప్పుడు సోలార్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.6.10 అయినట్టు అని, రూ.4.20కే లభించే థర్మల్ కన్నా ఇది యూనిట్‌కు రూ.1.90 ఎక్కువని తెలిపారు. అదే యూనిట్‌కు రూ.6 చొప్పున చెల్లించిన సౌర విద్యుత్ థర్మల్ స్థిర వ్యయంతో కలుపుకుని రూ.7.10 అవుతుందన్నారు. ఈ లెక్కన యూనిట్‌కు రూ.2.90 అధికం అవుతుందని తెలిపారు. ఇలా అధికంగా చెల్లించడం వల్ల ఈ ఐదేళ్ల కాలంలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రజాధనం రూ.2,636 కోట్లు చెల్లించినట్టుగా అధికారులు సీఎంకు వివరించారు. క్రిమినల్ కేసులు పెట్టాలి.. అధికారులు తన దృష్టికి తెచ్చిన వివరాలపై సీఎం జగన్ సీరియస్‌గా స్పందించారు. పవన, సౌర విద్యుత్‌ను ఈ స్థాయిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ రేట్లకు కొన్నది ఎవరు? ఇలా కొనాలని నిర్ణయించింది ఎవరు? వీరందరిమీదా క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేయాలి.. ప్రజల సొమ్మును ఇలా దోచిపెడతారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రెండు రకాలుగా డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. సోలార్ విండ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలపై సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ కమిటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపి, విద్యుత్ కొనుగోలు రేట్లను తగ్గించేలా చూడాలని, అధికంగా చేసిన చెల్లింపుల రికవరీపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోలార్, విండ్ విద్యుత్ కంపెనీలతో ఒప్పందాలు కుదిరిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అప్పటి సోలార్, విండ్ విద్యుత్ రేట్లను పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఒకవేళ కంపెనీలు దారికి రాకుంటే ఒప్పందాలు రద్దు చేయాలని, ఆ మేరకు ప్రత్యామ్నాయంగా తక్కువ రేటుకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ విద్యుత్ కొనుగోలుకు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని దోచుకోవడం వల్ల డిస్కమ్‌లకు కలిగిన నష్టాలేంటో అధికారులు సీఎంకు తెలిపారు. డిస్కమ్‌లకు 2019 మే నాటికి రూ.18,375 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ మొత్తం.. డిస్కమ్‌లు విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన సొమ్మని తెలిపారు. ఇన్ని వేల కోట్ల బకాయిలతో మొత్తంగా విద్యుత్తు రంగం మునిగే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. థర్మల్ మాటేంటి? జెన్కో నిర్మించే కొత్త థర్మల్ ప్లాంట్లలోనూ అవినీతి ఏరులై పారిందనే ఆరోపణలున్నాయి. దీనిపై సీఎం లోతుగా సమీక్షించారు. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మించే 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టులపై అవినీతి గురించి అధికారులు సీఎం దృష్టికి తేవడంతో వాటిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. బయట రాష్ట్రాల్లో ఒక మెగావాట్ తయారీకి రూ.4.49 – రూ.4.64 కోట్లు ఖర్చు చేస్తుంటే, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాల్లో మెగావాట్ ఉత్పాదక సామర్థ్యం కోసం దాదాపు రూ.7 కోట్లు ఎందుకు వెచ్చించాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో కూడా భారీగా దోచేశారని, ఇప్పటికైనా ఖజానాకు ఎంత మిగులుతుందో పరిశీలించాలని, త్వరలోనే రివర్స్ టెండరింగ్‌కు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ పేరుతోనూ లూటీ వాస్తవానికి మన రాష్ట్రంలో జీఎంఆర్ సంస్థ చౌకగా గ్యాస్ విద్యుత్ అందించేందుకు ముందుకొచ్చిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇది యూనిట్ కేవలం రూ.3.29కే ఇస్తానందని, కానీ గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతో పీపీఏలు ముగిసినా ల్యాంకో, స్పెక్ట్రం గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలను ప్రోత్సహించినట్టు చెప్పారు. నిజానికి ల్యాంకో స్పెక్ట్రంతో 2016 నాటికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముగిసింది. కానీ స్వల్ప కాలిక పీపీఏలు అప్పటికప్పుడు కుదుర్చుకుని, యూనిట్ కరెంటుకు 40 పైసలు అదనంగా పెట్టి రూ.3.70 తో కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. అదే సమయంలో జీఎంఆర్ వేమగిరి సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ.3.29తో కొనే అవకాశం ఉన్నా, ఆ సంస్థకు గ్యాస్ సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాయలేదన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.92 కోట్ల మేర అదనపు భారం పడిందని, మూడేళ్లలో రూ.276 కోట్లకుపైగా ఖజానాకు నష్టం వాటిల్లిన అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. అధికారుల వివరాలు విన్న సీఎం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుంభకోణాలకు పాల్పడిన అప్పటి ఉన్నతాధికారి, విద్యుత్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రిపైన విచారణ చేయాలని ఆదేశించారు. జరిగిన విషయాలను వివరిస్తూ కేంద్రానికి ఒక లేఖ రాసి, గ్యాస్ అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. బాగు చేద్దాం.. తోడుగా ఉండండి వ్యవస్థను బాగు చెయ్యాలన్న తన ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలని సీఎం జగన్ కోరారు. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెప్తున్నానన్నారు. అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, దీనిపై వడ్డీలు, ఇతర రూపంలో రూ.40 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో చూడాలని, బాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో పగటి విద్యుత్ అందించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై 30 నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో పనులు పూర్తి చేసి పగటి పూట కరెంటు ఇవ్వాలని ఆదేశించారు. ఈ పీడర్లలో చేపట్టాల్సిన పనులకోసం రూ.1,700 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. -
వెలుగుల శాఖపై నిఘా నీడ
సాక్షి, ఏలూరు : ఏటా విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి. అయినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖలో అవకతవకలను అరికట్టేందుకు ఈపీడీసీఎల్ చర్యలు చేపట్టింది. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల నుంచి విద్యుత్ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై దృష్టి సారించేందుకు రహస్య తనిఖీ బృందాలను సంస్థ సీఎండీ ఎంవీ శేషగిరిబాబు నియమించారు. మరమ్మతులపై నిఘా జిల్లాలో సుమారు 45 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలకు కనీసం 100 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుం టాయి. వాటికి మరమ్మతులు చేసే సందర్భంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు ఈపీడీసీ ఎల్ సీఎండీ దృష్టికి వెళ్లింది. దీంతో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఇటీవలే ఓ బృందం జిల్లాలో పర్యటించింది. ఇలా తనిఖీ చేయడం వల్ల పొరపాట్లు జరగకుండా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తారని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ అభిప్రాయపడ్డారు. నిర్మాణాల్లో జాప్యంపై ఆరా జిల్లాలో ప్రస్తుతం 196 విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. వాటిపై లోడ్‌ను తగ్గించేందుకు, హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా 27 సబ్స్టేషన్లు నిర్మించాలనుకుంటున్నారు. వీటికి సంబంధించి అనుమతులు మంజూరు కాగా, టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో 18 సబ్స్టేషన్ల నిర్మాణానికి జనవరి నుంచి టెండర్లు పిలవలేదు. దీనిపై నిఘా బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. పెనుగొండలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఐదేళ్లుగా నిర్మాణం పూర్తిచేసుకోలేదు. సబ్స్టేషన్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండటం, టెండర్లు పిలవకపోవడంపై బృందం ఆరాతీసింది. దీనిపై సీఎండీకి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్ల ఇంజినీర్లు, ట్రాన్స్‌కో అధికారులతో చర్చించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్ఈ సూర్యప్రకాష్ చెప్పారు.