కరెంటు పనుల్లో అక్రమాలు! | Irregularities In Current Works In Adilabad | Sakshi
Sakshi News home page

కరెంటు పనుల్లో అక్రమాలు!

Published Wed, Oct 23 2019 8:52 AM | Last Updated on Wed, Oct 23 2019 8:52 AM

Irregularities In Current Works In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌లో స్తంభాలు తొలగించి రోడ్డు పక్కన టవర్లు ఏర్పాటు చేసి వైర్లు వేస్తున్న కూలీలు

చిత్రంలో ఆటోలో మధ్యన కూర్చున్న కూలీ పేరు శంకర్‌. ఇతనిది ఖమ్మం. ఆదిలాబాద్‌లోని ఎన్టీఆర్‌చౌక్‌లో రోడ్డు విస్తరణలో భాగంగా కరెంటు స్తంభాలను జరిపి రోడ్డుకు కొంతదూరంగా వేసి దానికి కండక్టర్‌ బిగిస్తుండగా మంగళవారం విద్యుత్‌ ఘాతానికి గురై కొద్దిలో చావుతప్పి గాయాలతో బయట పడ్డాడు. సాధారణంగా కరెంటు పనులు చేసేటప్పుడు సరఫరా నిలిపివేస్తారు. అయితే ఈ కూలీ హెచ్‌టీ కరెంటు పనులు చేస్తుండగా కింద ఉన్న ఎల్టీ కరెంటుకు కండక్టర్‌ తగలడంతో విద్యుత్‌ ఘాతానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పనులు శాఖల మధ్య ఒక ఒప్పందంతో జరుగుతున్నవి కావు. అలాంటప్పుడు ఈ పనులకు ఎల్‌సీ ఇచ్చిందెవరు? అనధికారికంగా పనులు చేస్తే విద్యుత్‌ ఘాతానికి గురైన కూలీలు మృతిచెందితే ఎవరు బాధ్యులు అనే ప్రశ్న తలెత్తుతోంది. 

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలో రిమ్స్‌ ఆస్పత్రి నుంచి తిర్పెల్లి వరకు నాలుగు వరుసలుగా ఉన్న పాత ఎన్‌హెచ్‌ రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్‌టీ కరెంటు స్తంభాలను తొలగించి టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల స్తంభాలనే ఉంచి మిగతా చోట్ల టవర్లు ఏర్పాటు చేసి వాటినుంచి కండక్టర్‌ (వైరు) లాగుతున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ పనులు కలిపి మొత్తం రూ.44.03 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ఈ పనులు చేపడుతోంది. ఇక్కడివరకు వ్యవహారం సజావుగానే ఉంది. అయితే విద్యుత్‌ స్తంభాల తొలగింపు, టవర్ల ఏర్పాటువంటి పనులకు పైన పేర్కొన్న నిధుల్లోంచే రూ.3 కోట్లతో ప్రత్యేకంగా పనులు చేపడుతున్నారు. ఇక్కడే అవినీతికి తెరలేచింది. ఆర్‌అండ్‌బీశాఖ పనులు చేపడుతుండగా విద్యుత్‌శాఖకు 10శాతం నిధులను నిర్మాణ ఖర్చుల కింద చెల్లించి చేపట్టాలి. ఇక్కడ ఇరు శాఖల అధికారులు ఒక ఒప్పందం చేసుకొని విద్యుత్‌శాఖ ఆదాయానికి గండిపెట్టి తమ జేబులు నింపుకునేలా అనధికారికంగా పనులు చేపడుతున్నారు. పైగా విద్యుత్‌శాఖ డీఈ ఈ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ నుంచి ఎంబీ రికార్డు చేసి కార్పొరేట్‌ ఆఫీసుకు నిధులు నేరుగా పంపిస్తారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా పది శాతం నిధులు, విద్యుత్‌ అంతరాయానికి సంబంధించిన మొత్తం కలిపి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ద్వారా ఒప్పందం చేసుకొని చెల్లింపులు జరిపిన తర్వాతే ఈ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఆ శాఖాధికారులే చెబుతున్నారు.

అక్రమం ఇలా..
రూ.3 కోట్ల ఈ కరెంటు పనుల్లో విద్యుత్‌శాఖకు ఆర్‌అండ్‌బీ 10శాతం నిర్మాణ ఖర్చుల కింద చెల్లించాలి. ఈ లెక్కన రూ.30లక్షలు ఆ శాఖకు చెల్లించాలి. అదేవిధంగా పనులు జరిగే సమయంలో కరెంటు అంతరాయానికి సంబంధించి ఎంతైతే విద్యుత్‌శాఖకు నష్టం చేకూరుతుందో అంత పనులు చేపట్టే వారినుంచి వసూలు చేయాలి. దీనికి సంబంధించి ముందుగా ఆర్‌అండ్‌బీ నుంచి విద్యుత్‌శాఖకు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించి అంచనా వ్యయం రూపొందించి ఆ వ్యయాన్ని డిమాండ్‌ నోటీసు ద్వారా పంపిస్తారు. దానికి బదులుగా ఆర్‌అండ్‌బీ శాఖ ఈ మొత్తాన్ని చెల్లించి ఒక ఒప్పందం చేసుకొని అప్పుడు పనులు చేపట్టాలి. అయితే ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న స్తంభాల తొలగింపు, టవర్ల బిగింపు పనులు ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరుశాఖల అధికారుల మధ్య రహస్య ఒప్పందంతో అక్రమ పద్ధతిలో జరుగుతున్నాయి. తద్వారా లక్షల రూపాయలు ఇరుశాఖల అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయి.

ఎల్‌సీ దోపిడీ..
కరెంటు పనులు అధికారికంగా చేపడుతున్నప్పుడు సంబంధిత విద్యుత్‌ శాఖాధికారులు లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) జారీ చేసి ఎన్ని గంటల పాటైతే పనులు చేపడతారో ఆ కరెంటు అంతరాయానికి సంబంధించి వ్యయాన్ని లెక్కగట్టి పనులు చేపడుతున్న వారి నుంచి కట్టిపించుకోవాలి. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఇలాగే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్తంభాలను జరిపి టవర్లను బిగించారు. అయితే ఆదిలాబాద్‌లో జరిగే పనికంటే నిర్మల్‌లో జరిగిన ఆ అభివృద్ధి పని 50 శాతమే. అందులో పనులు జరుగుతున్నప్పుడు అక్కడ ఒక సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసినందుకు పనులు చేపట్టిన శాఖ నుంచి రూ.18లక్షలు విద్యుత్‌ శాఖకు చెల్లించారు. ఆదిలాబాద్‌లో జరుగుతున్న పనిలో భుక్తాపూర్, ఖానాపూర్, దస్నాపూర్‌ మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి చేపడుతున్నారు. అంతేకాకుండా ఎడాపెడ రోజంతా కూడా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారు.

ఈ లెక్కన కరెంటు అంతరాయం కింద ఆర్‌అండ్‌బీ శాఖ సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వరకు చెల్లించాల్సి వచ్చేదని కొంతమంది విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఈ పనులు అనధికారికంగా జరుగుతుండడంతో ఇప్పుడీ డబ్బులన్ని ఇరుశాఖల అధికారులు ఒక ఒప్పందం ప్రకారం అక్రమ పద్ధతిలో స్వాహా చేయడం ఖాయమని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌లో జరుగుతున్న పనులకు సంబంధించి అసలు ఎంత మొత్తం, ఎలా జరుగుతున్నాయనే వివరాలు అధికారుల వద్ద చెప్పేందుకు లేవు. జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, ఆదిలాబాద్‌ శివారు ఖానాపూర్‌లోనూ ఇలాంటి పనులే జరగగా, అవికూడా ఒప్పందం లేకుండానే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీఎండీ దృష్టి సారించి అధికారుల అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సీఎండీ దృష్టి పడేనా..
టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. విద్యుత్‌ శాఖాధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఆదిలాబాద్‌ పట్టణంతోపాటు జిల్లాలో రోడ్డు విస్తరణలో భాగంగా కరెంటు పనులన్నీ ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుండానే యథేచ్ఛగా జరుగుతున్నాయి. సీఎండీ ఇలాంటి అక్రమాలపై దృష్టి సారిస్తేనే విద్యుత్‌శాఖకు ఆదాయం, పనులు చేస్తున్న కూలీలకు భద్రత ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్‌ ఎస్‌ఈ పర్యవేక్షణలో ఈ పనులు జరగాల్సి ఉండగా, ఆయన వివరణను ‘సాక్షి’ కోరినప్పుడు ఈ పనులపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఆదిలాబాద్‌ డీఈఓ ఈ పనులు చూస్తున్నారని చెప్పడం గమనార్హం.

అంచనా వ్యయం రూపొందించాం
ఆదిలాబాద్‌లో రహదారి విస్తరణలో భాగంగా విద్యుత్‌ స్తంభాలను జరిపి, టవర్లు నిర్మించే పనులు చేపడుతున్నాం. వీటి అంచనా వ్యయాలను ఇదివరకే రూపొందించాం. అయితే ఆర్‌అండ్‌బీ నుంచి మాత్రం చెల్లింపులు జరగలేదు. వారి పనులకు సంబంధించి మెజర్మెంట్‌ బుక్‌ (ఎంబీ)లో నమోదు చేసి పైకి పంపిస్తారు. అక్కడి నుంచి విద్యుత్‌శాఖకు చెల్లింపులు జరుపుతారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు.
– సుభాష్, విద్యుత్‌శాఖ డీఈ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement