సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు శాఖలో అవినీతి, అక్రమాలు, దుబారాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు, సీబీఐ విచారణకు సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. పీపీఏల్లో లొసుగులు, లోపాలపై ఆధారాలు అందజేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సమాధానం చెప్పించడం కాదని, దమ్ముంటే ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు సిద్ధమని ప్రభాకర్‌రావు చెప్పారని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్తు సంస్థలో రూ.8వేల కోట్ల వరకు అవినీతి జరిగిందని, మరో రూ.10వేల కోట్లకు పైగా నష్టంవాటిల్లిందని, ఇదీ ముమ్మాటికి నిజమన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతరాలకు రూ.7వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్‌కు రూ.1800 కోట్లు, సోలార్ సంస్థలకు రూ.3వేల కోట్లు బకాయి పడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల బిల్లులు కట్టకపోతే సర్పంచులను పీకేస్తామని అంటున్న సీఎంను విద్యుత్తు బకాయిలు చెల్లించనందుకు ఏం చేయాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొనసాగే హక్కు ఉందా? అని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.3.50కే యూనిట్ విద్యుత్తు లభిస్తుంటే ఛత్తీస్‌గఢ్‌తో రూ.4.50కు యూనిట్ చొప్పున ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.
సోలార్ విద్యుత్‌లోనూ చేతివాటమే!
యూనిట్ సోలార్ విద్యుత్‌ను రూ.4.50 కంటే తక్కువకే కొనుగోలు చేయాలని 2015లో కేంద్రం స్పష్టం చేసిందని, ఒకవేళ బిడ్డింగ్‌లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తే ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’కింద ఎక్కువ మొత్తాన్ని తాము భరిస్తామని కేంద్రం విధానపరమైన నిర్ణయం చేసినా పట్టించుకోకుండా యూనిట్‌కు రూ.5.50 చొప్పున 2వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ పీపీఏలు సంతకాలు చేసే సమయానికి టీటీడీ రూ.4.49లకు, రాజస్తాన్ ప్రభుత్వం రూ.4.34లకు ఒప్పందం చేసుకున్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు ఒక రూపాయి అధికంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకోవడం వల్ల రాష్ట్రానికి రూ.8వేల కోట్ల నష్టంవాటిల్లిందన్నారు. ఇదీ ఛార్జీల రూపంలో ప్రజలపై పడే భారం కాదా? అని ప్రశ్నించారు.
విద్యుత్ అవినీతిపై సీబీఐకి సిద్ధమా?
Published Tue, Aug 27 2019 3:34 AM | Last Updated on Tue, Aug 27 2019 3:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment