ఆత్మీయ సమ్మేళనంలో అభివాదం చేస్తున్న నాయకులు
చౌటుప్పల్: బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఏకమై కేసీఆర్ గడీలు బద్దలుకొట్టి గరీబోళ్ల రాజ్యం సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూ, నిజాంలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలన్నారు. ఇందుకోసం ఎంతో మంది ఉద్యమకారులు బీజేపీలోకి వస్తుంటే.. కొంతమంది మాత్రం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేందుకు వెళ్తున్నారని విమర్శించారు.
గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గస్థాయి గౌడన్నల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలను కులాల వారీగా విభజించి ఓట్లు దండుకునేందుకు తండ్రీకొడుకులు వెంపర్లాడుతున్నారని అన్నారు. బీసీ కులాలకు చేసిన మేలు చెప్పలేని స్థితిలో ఉన్న కేసీఆర్, కొత్త కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియంతపాలనపై తిరుగుబాటు చేసి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు.
బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారు
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బలహీనవర్గాలు అభివృద్ధి చెందితే ప్రశ్నించే స్థాయికి వస్తారన్న ఆలోచనతో కేసీఆర్ ఆయా వర్గాలను అణగ దొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మునుగోడులో ఓటమి భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన సంకల్పమన్నారు.
ఇందుకోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనను బయటకు పంపారని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు బద్ద శత్రువు అని అన్నారు. మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎనిమిదిన్నరేళ్ల పాలనలో నాటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. నియంతపాలనను బొంద పెట్టేందుకే తాను రాజీనామా చేశానన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలోని నాయకులకు ప్రశ్నించే సత్తాలేదని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment