దీపావళి నుంచి పేమెంట్ బ్యాంక్ సేవలు
కోలకత్తా: పేటీఎం బ్యాంక్ ఇక పేమెంట్ బ్యాంకు గా అవతరించేందుకు అవసరమైన చర్యలు మరింత వేగవంతమయ్యాయి. తమ పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నట్టు బ్యాంక్ ఉపాధ్యక్షురాలు రుచితా తనేజా అగర్వాల్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ సదస్సులో మాట్లాడుతూ ఆమె ఆ విషయాన్ని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్ బీఐ నుంచి తుది లైసెన్సుల అనంతరం కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన పేమెంట్ బ్యాంకు ద్వారా సరికొత్త వ్యాపార విధానాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పారు. ధనార్జన తమ లక్ష్యంకాదని, ఇప్పటివరకు ఆర్థిక సేవలు అందుబాటులోలేని పేదలకు ఈ సేవలు చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అలాగే ప్రజలనుంచి వసూలు చేసే ఫీజు విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించనున్నామని ఆమె తెలిపారు.
ఈ బ్యాంకు సాయంతో చిన్నపట్టణాలకూ పేటీఎంను విస్తరించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు లోన్లు, ఇతర ఆర్థిక సేవల కల్పనలో బ్యాంకులు , ఎన్ బీఎఫ్ సీతో చర్చల్నిముమ్మరం చేసినట్టు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులు యుటిలిటీ బిల్లులు, కిరాణా, రైలు టిక్కెట్లు, పాఠశాల ఫీజు తదితర రోజువారీ చెల్లింపులు సులభంగా వేగంగా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.
పేమెంట్ బ్యాంక్ ద్వారా ఫైనాన్షియల్ ఉత్పత్తులు అందించేందుకు పలు బ్యాంకులు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫిజికల్ టచ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ప్రస్తుతం పేటీఎంను 20 నగరాల్లోని 13.5 కోట్ల మందితో నెలకు సుమారు 75-90 మిలియన్ల లావాదేవీలకు సమీపిస్తున్నట్టు తెలిపారు. 8 లక్షల మంది చిన్న వ్యాపారులు, సర్వీసు ప్రొవైడర్ల భాగస్వామ్యంతో ఈ సంవత్సరాంతానికి 1 మిలియన్ లక్ష్యాన్ని చేరుకునే ప్రణాళికతో ఉన్నట్టు అగర్వాల్ చెప్పారు