నష్టపరిహారానికి గ్రీన్‌సిగ్నల్
- విద్యుత్‌లైన్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న వారికి శుభవార్త
- ‘సాక్షి’ కథనంతో వాస్తవాలు వెలుగులోకి..
యాచారం: విద్యుత్ లైన్ల ఏర్పాటుతో నష్టపోతున్న రైతులకు ట్రాన్స్మిషన్ సంస్థ తగిన నష్టపరిహారాన్ని ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ మేరకు జిల్లాలో ట్రాన్స్మిషన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 400 కేవీ విద్యుత్ లైన్ వల్ల భూములు నష్టపోయే రైతుల వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వివిధ మండలాల తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా సూర్యపేట నుంచి జిల్లాలోని శంకర్పల్లి వరకు యాచారం, కందుకూర్, మహేశ్వరం, షాబాద్, చేవేళ్ల మండలాల గూండా టాన్స్‌మిషన్ సంస్థ విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ పనులను ట్రాన్స్మిషన్ అధికారులు ఆరు నెలల కింద యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ప్రారంభించారు. పనుల ప్రారంభంలో ట్రాన్స్మిషన్ అధికారులు రైతులను భయపెట్టి టవర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. రైతులు తీవ్ర వ్యతిరేకత చూపగా కేవలం రూ.15 నుంచి రూ. 20 వేల వరకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. కొందరికి రూ. 15 వేల చెక్కులు ఇచ్చి టవర్ల పనులు పూర్తి చేయడం ప్రారంభించారు.
రైతుల ఫిర్యాదు మేరకు ‘సాక్షి’ దినపత్రికలో జూన్ 10న ‘ట్రాన్స్మిషన్ మాయ ’ కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలపై కోదండరెడ్డి ట్రాన్స్మిషన్ సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిహారంపై నిలదీశారు. నిబంధనలు కూడా అనువుగా ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ ఒక కమిటీని వేసి పరిహారం చెల్లింపు విషయంలో నిర్ణయం తీసుకున్నారు.
రోడ్డుకు సమీపంలో రూ.1000...
ఎట్టకేలకు ట్రాన్స్మిషన్ సంస్థ టవర్ల వల్ల భూములు కోల్పోతున్నవారికి నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకోవడంపై రెతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. జిల్లాలోని పలు మండలాల్లో ఈ టవర్ల ఏర్పాటు వల్ల 200 మందికి పైగా రైతులు నష్టపోయారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రాన్స్మిషన్ అధికారులు, రైతుల కమిటీ నాయకులు రెండు పద్ధతుల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. రోడ్డు సమీపంలో, ఇండ్ల దగ్గర ఏర్పాటు చేసే టవర్లకు గజానికి రూ. 1000 చొప్పున, అదే కొద్ది దూరంలో ఏర్పాటు చేసే టవర్లకు గజానికి రూ.750 చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు.
పంటలు, ఇతరత్రా నష్టపోయిన వాటికి కూడా తగిన పరిహారం ఇచ్చే విధంగా ఉత్తర్వులో పొందుపర్చారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆయా మండలాల తహసీల్దార్లు సర్వే చేసి ట్రాన్స్మిషన్ అధికారులకు నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు చెక్కుల రూపేణా పరిహారం అందనుంది. నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తే ఒక్కో రైతుకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పైగా అందనుంది. గురువారం ట్రాన్స్మిషన్ అధికారులు మొండిగౌరెల్లిలో పర్యటించి పరిహారం ఇచ్చే నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇదే విషయమై ట్రాన్స్మిషన్ ఎస్ఈ వెంకటనారాయణను సంప్రదించగా తహసీల్దార్లు నివేదిక ఇచ్చిన వెంటనే రైతులకు పరిహారం అందజేస్తామన్నారు.
‘సాక్షి’ కృషి వల్లే..
సాక్షి పత్రికలో కథనం వచ్చేవరకు మాకు ప్రభుత్వమే విద్యుత్ టవర్లు వేయిస్తోందని అనుకున్నాం. తర్వాత తెలిసింది, మమ్మల్ని భయపెట్టి ట్రాన్స్మిషన్ అధికారులు టవర్లు వేస్తున్నారని. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనాన్ని తీసుకోని పలు రాజకీయ పక్షాల నాయకులకు ఫిర్యాదు చేశాం. కలెక్టర్‌ను పలుమార్లు కలిశాం. మొదట్లో రైతులు కేవలం రూ. 15 వేలు కూడా తీసుకున్నారు. ‘సాక్షి’ కృషి వల్ల నేడు రూ. లక్షల్లో పరిహారం అందుతుండడం సంతోషంగా ఉంది.
- దేవరకొండ సత్తయ్య, రైతు, మొండిగౌరెల్లి