సంక్షోభంలో చేనేత రంగం
ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న నేతన్నలు
పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం
నేటి నుంచి ఆమరణ దీక్షలు
ధర్మవరంటౌన్ : అగ్గిపెట్టెలో ఒదిగే పట్టు చీరను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (పేటెంట్ హక్కు) పొందిన చేనేత రంగం భవిష్యత్ సంక్షోభంలో కూరుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, సోమందెపల్లి, కోటంక, సిండికేట్ నగర్, యాడికి తదితర ప్రాంతాల్లో 1.5లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధార పడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత రంగంపై 5 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. పవర్లూమ్ ఉత్పత్తులు పట్టు ప్రాముఖ్యతను దెబ్బతీస్తుండడంతో చేనేత సంక్షోభం తారాస్థాయికి చేరింది. ధర్మవరం పట్టణంలో 15వేలకు పైగా మగ్గాలు మూత పడ్డాయి.
సంక్షోభానికి ప్రధాన కారణం
చేనేత రంగం సంక్షోభానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిన ముడిసరుకు ధరలు. పట్టు చీరలకు ఉపయోగించే వార్పు, రేషం, జరీ ధరలు మూడిం తలు పెరిగాయి. పట్టుచీర ధర మాత్రం ఒకే విధంగా ఉంది. అంతేకాకుండా పవర్లూమ్ మగ్గంలో తయారైన చీర ధరకు వెయ్యి నుంచి 1500 వరకు తక్కువ ధర ఉండడంతో వ్యాపారులు మరమగ్గాల చీరలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో చేనేత పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.
నేటి నుంచి ఆమరణ దీక్షలు
ప్రాణాలర్పించైనా ధర్మవరం పట్టణంలో పవర్లూమ్స్కు అనుమతులు సాధించి ఏర్పాటు చేసుకుంటామని పవర్లూమ్ అసోసియేషన్ నాయకుల గిర్రాజు రవి, కాటా రామాంజినేయులు పేర్కొన్నారు. మరమగ్గాల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ అసోసియేషన్ సభ్యులు చేసు ్తన్న నిరాహారదీక్షలు ఆదివారం నాటికి 5వరోజుకు చేరాయి. వారు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందన్నారు. ఒక్క అనంతపురం జిల్లా ఏడీ మాత్రం ఆ ఆదేశాలను పాటించలేదన్నారు.
కర్ణాటక వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు లొంగి చేనేతల పొట్టకొడుతున్న ఏడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. యేడాదికి 30మందికిపైగా నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ ఆత్మహత్యలకు హ్యాండ్లూమ్ ఏడీ బాధ్యత వహించాలన్నారు. మరమగ్గాల అనుమతుల కోసం సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. ఈ దీక్షల్లో రాధాకృష్ణ, ఓబుళరాజు, నాగయ్య, ఓబుళమ్మ, రామక్క, సాలమ్మ, చెన్నమ్మ, రంగమ్మ పాల్గొన్నారు.