అగ్నిగుండం.. విద్యుత్ గండం
సాక్షి, ఏలూరు: వేసవి ప్రారంభంలోనే సూర్యుడు అగ్నిగుండంలా మారడంతో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించేందుకు ఆపసోపాలు పడుతున్నా రు. ఉదయం 11 గంటలకే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ వినియోగం రికా ర్డు స్థాయిలో పెరిగింది. దీనివల్ల విద్యుత్ కోతలు తప్పడం లేదు.
విద్యుత్ కష్టాలు జిల్లా ప్రజలకు ఏటా అలవాటుగా మారిపోయింది. అటు ప్రభుత్వం, ఇటు పాలకులు పట్టించుకోకపోవడం వల్ల విద్యుత్ కేటాయింపుల్లో అన్యాయమే జరుగుతోంది. జిల్లాలో మంగళవారం 37 డిగ్రీల గరిష్ట, 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం రోజుకు అత్యధికంగా కోటి 30లక్షల యూనిట్లు విద్యుత్ అవసరం అవుతోంది. దానికనుగుణంగా విద్యుత్ కోటా ఇవ్వడం లేదు. డిమాండ్‌కు కోటాకు మధ్య 30 లక్షల యూనిట్ల వ్యత్యాసం ఉంది.
ఇంత తక్కువగా విద్యుత్ ఇవ్వడంతో ప్రజావసరాలకు సరిపోవడం లేదు. దీంతో ఏలూరు నగరంతోపాటు పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండలాలు, గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏలూరు నగరంలో రోజుకు 3 నుంచి 4గంటలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో 4 నుంచి 6 గంటలు కోత పెడుతుంటే.. గ్రామాల్లో 8గంటలు తక్కువ కాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. రాత్రి, అర్ధరాత్రి సమయాల్లోనూ కోత విధిస్తుండటంతో ప్రజలు నిద్రకు కరువవుతున్నారు.
పరిశ్రమలకు పవర్ హాలిడే పెంపు !
పరిశ్రమలకు ప్రస్తుతం వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ మరింత పెరిగితే పవర్‌హాలిడే రోజుల్ని పెంచి గృహవిద్యుత్ వినియోగానికి సర్దుబాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పొగాకు, మొక్కజొన్న పంటలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. వాటికి నీటి వాడకం తగ్గుతుంది. అరుుతే, కొద్దిరోజుల్లో కోకో, కొబ్బరి తోటలకు నీటి అవసరం పెరుగుతుంది. అప్పటికి వరి పంట చేతికి అందుతుంది.
వరికి వాడే విద్యుత్‌ను తోటలకు మళ్లించడం ద్వారా కాస్తై ఆదుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఎండలకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం విద్యుత్ శాఖకు సమస్యగా మారింది. గడచిన నెల రోజుల్లో దాదాపు 500 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, వారం రోజుల వ్యవధిలోనే అధిక శాతం కాలిపోయాయి.
ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. అవసరానికి అనుగుణంగా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే సిద్ధం చేస్తున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఎప్పుడూ కనీసం 500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండటం, వినియోగం భారీగా పెరగడం వల్ల అత్యవసర లోడ్ రిలీఫ్ విధిస్తున్నామని వివరించారు.