కరెంటివ్వని బాబు కాలెట్ల పెడతడు?: హరీశ్
సిద్దిపేట: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు కరెంట్ ఇవ్వడంలో ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. అలాంటి వ్యక్తి నేడు తెలంగాణలో పర్యటించాలని భావించడం అర్థరహితమని పేర్కొన్నారు. కరెంట్ ఇవ్వని బాబు కాలెట్ల పెడతాడంటూ మండిపడ్డారు. ఆది వారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంటలు ఎండిపోతాయనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం నీటి విడుదలకు చొరవ చూపిందన్నారు. కానీ చంద్రబాబు కుట్రతో తెలంగాణకు విద్యుత్ కోతలు ఏర్పడేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి బాబును ఈ ప్రాంత ప్రజలు ఆదరించబోరన్నారు. త్వరలో ఆ పార్టీ దుకాణం ఖాళీ కానుందన్నారు. చంద్రబాబు వైఖరితో హైదరాబాద్‌లో ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.