ఎన్డీఏ వైపు బీజేడీ, అన్నాడీఎంకే!
న్యూఢిల్లీ/భువనేశ్వర్, న్యూస్‌లైన్: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో పొత్తులపై చర్చ తీవ్రమైంది. ఒడిశాలో అధికార బీజేడీ నుంచి బీజేపీకి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. దేశ, రాష్ర్ట ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకు బయటినుంచి మద్దతిచ్చేందుకు అభ్యంతరం లేదని బీజేడీ చీఫ్ విప్ ప్రభాత్ త్రిపాఠీ తెలిపారు. అయితే ఈ అంశంపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్పందిస్తూ ఎన్డీఏకు మద్దతుపై ఇంకా ఆలోచించలేదని, ఫలితాలు వచ్చేవరకు వేచి చూస్తామన్నారు. తమ మద్దతు కోసం ఎన్డీఏ నుంచి కూడాఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇదే బాటలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ స్తే దాంతో జతకట్టేందుకు తమ అధినేత్రి సిద్ధమేనని అన్నాడీఎంకే నేత మలైసామి తెలిపారు. జయకు నరేంద్ర మోడీ మంచి మిత్రుడన్నారు. దీన్ని జయలలిత కూడా తోసిపుచ్చలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానని మీడియాతో పేర్కొన్నారు.