గంగానది పుట్టుపుర్వోత్తరాలపై లోక్సభలో ప్రశ్నలు!
న్యూఢిల్లీ: హిందువులు పవిత్రంగా భావించే గంగా నదిపై ఈ రోజు లోక్సభలో విచిత్రమైన ప్రశ్నలు అడిగారు. గంగా నది ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు తెచ్చారు? ఆ నదిలో సాన్నం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? ...ఇలా సాగింది ప్రశ్నల పరంపర. సభలో బీజేపీ ఎంపీ ప్రభాత్సిన్హ్ ప్రతాప్సిన్హ్ చౌహాన్ ఈ ప్రశ్నలు అడిగారు. 'ఏంటిది? ఇది కూడా ఓ ప్రశ్నేనా?' అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో జలవనరుల శాఖ సహాయమంత్రి సాన్వర్ లాల్ జాట్ సమాధానమిస్తున్న సమయంలో చౌహాన్ ఈ ప్రశ్నలు అడిగారు.
దీంతో కొందరు సభ్యులు ఆయనని ఆశ్చర్యంగా చూశారు. మరికొందరు నవ్వుకున్నారు. మంత్రి కూడా కాసేపటికి తేరుకొని, జనావళి సంక్షేమం కోసం ఆ నదిని భగీరథుడు భూమి మీదకు తీసుకువచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. గంగానదికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, పరీవాహక ప్రాంతాలను అభివద్ధి పరిచేందుకు ఐఐటీ నిపుణుల కమిటీ జనవరిలో సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని మంత్రి సాన్వర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎనిమిది అంశాలపై కమిటీ సిఫారసులు చేసిందని వివరించారు.