చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన యువతి అరెస్టు
గుంటూరు ఈస్ట్: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువతిని కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నాలుగు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 1వ తేదీ వెంకటేశ్వరవిజ్ఞాన మందిరం రోడ్డులో పెదకూరపాడు మండలం అబ్బురాజుపాలెం గ్రామానికి చెందిన అమరనేని అనసూయమ్మ సిటీ బస్సు దిగుతుండగా ఓ యువతి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారం నానుతాడు తెంచుకుని పరారైంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం తమిళనాడుకు చెందిన ప్రభుమారి అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నుండి నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతిలో పాల్గొన్న హెడ్‌కానిస్టేబుల్ ఎం డీఎ ఖాన్, సిబ్బంది తనూజా, లక్ష్మి తిరుపతమ్మలను ఎస్సై అభినందించారు.