బిల్డర్ హత్య కేసులో దోషిగా అబూ సలేం
ముంబై: 1995నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్ అబూసలేంతోపాటు మరో ఇద్దరిని ఇక్కడి ప్రత్యేక టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. ప్రదీప్ జైన్, అతడి సోదరుడు సునీల్‌తోపాటు బిల్డర్లను డబ్బుకోసం బెదిరించి సలేం భయకంపనలు సృష్టించాడని టాడా కోర్టు జడ్జి జీఏ సనప్ సోమవారం చెప్పారు. ఈ కేసులో శిక్షలపై మంగళవారం కోర్టులో వాదనలు జరిగే అవకాశముంది. సలేంతోపాటు వీరేంద్ర జాంబ్, మెహందీ హసన్‌లను ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 120బీ (కుట్ర)లతోపాటు టాడాలోని సంబంధిత సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించినట్లు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ చెప్పారు. భారత్ బయట కుట్రపన్ని ఇక్కడ దోషిగా నిరూపితమవడం ఈ కేసులోనే తొలిసారన్నారు. 1994 అక్టోబర్‌లో దుబాయ్‌లో సలేం, ఖాన్, హసన్, కయ్యూమ్ అన్సారీ, డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ కస్కర్లు జైన్ సోదరుల ఆస్తులపై కన్నేసి బెదిరించారని జడ్జి పేర్కొన్నారు. ఆస్తులపై హక్కులివ్వకపోతే కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రదీప్ తొలుత పది లక్షలు ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇవ్వకపోవడంతో 1995, మార్చి 7న జుహూ బంగళా బయట జైన్‌ను తుపాకీతో కాల్చి చంపారన్నారు.