ర్యాన్ స్కూల్లో ఎన్నో లోపాలు
► నిజనిర్ధారణ కమిటీ నివేదిక
► బాలుడి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీంలో తండ్రి పిటిషన్
గుర్గావ్/న్యూఢిల్లీ: గుర్గావ్లో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న ఠాకూర్ హత్య జరిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో పలు లోపాలు ఉన్నట్లు నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. బాలుడి హత్య అనంతరం సీబీఎస్ఈ నియమించిన ఈ కమిటీ తన నివేదికను సోమవారం సమర్పించింది. పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదనీ, బస్ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవని తెలిపింది. టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడం, ప్రహరీ గోడ కూలిపోయి ఉండడం, కాలం చెల్లిన అగ్నిమాపక యంత్రాలను అలంకారప్రాయంగా పెట్టడం తదితరాలను నిర్వహణా లోపాలుగా కమిటీ పేర్కొంది.
ఉద్యోగుల వివరాలను పాఠశాల యాజమాన్యం పోలీసులతో తనిఖీ చేయించని విషయాన్ని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. మరోవైపు బాలుడి హత్య కేసును సీబీఐకి అప్పగించే విషయమై స్పందన తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రం, హరియాణా ప్రభుత్వాన్ని కోరింది. సీబీఐ విచారణ కోరుతూ బాలుడి తండ్రి వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం విచారించింది. ఇలాంటి కేసుల్లో పాఠశాల యాజమాన్యాలనే బాధ్యులను చేసేలా నిబంధనలు తీసుకురావాలని బాలుడి తండ్రి కోరగా, దీనిపై స్పందించాలని సీబీఎస్ఈని ఆదేశించింది.
ముందస్తు బెయిలుకు ర్యాన్ దరఖాస్తు
పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ ఆగస్టీన్ పింటో, ఆయన భార్య, మేనేజింగ్ డైరెక్టర్ గ్రేస్ పింటో, వారి కొడుకు, పాఠశాల సీఈవో ర్యాన్ పింటోలు ముందస్తు బెయిలు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వీరిని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముంబైకి వెళ్లింది.