వైభవోపేతం.. అహోబిలేశుడి బ్రహ్మోత్సవం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో ఐదో రోజు మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారు శేషవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రత సేవ అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చనలు, నవకళశ స్థాపన, జలాఅభిషేకం నిర్వహించారు.
అనంతరం పట్టువస్త్రాలు, మణి మానిక్యాలతో ప్రత్యేకంగా అలకంరించిన స్వామి అమ్మవార్లను శేషవాహనంలో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలనరసింహస్వామికి రాత్రి పట్టు వస్త్రాలతో, వజ్ర, వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి శరభ వాహనంపై కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాదు, మఠం ప్రతినిధి సంపత్, ప్రధానార్చకులు వేణుగోపాలన్ పాల్గొన్నారు.