'ప్చ్.. మా అన్నయ్య పాలన నచ్చలే': ప్రహ్లాద్ మోదీ
న్యూఢిల్లీ: తన అన్నయ్య ప్రధాని నరేంద్రమోదీ పరిపాలన బాగాలేదని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. ప్రజల అంచనాను బీజేపీ ప్రభుత్వం అందుకోలేకపోయిందని, వారి సమస్యలను తీర్చేందుకు కచ్చితంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం జంతరమంతర్ వద్ద ఆల్ ఇండియా ఫేయిర్ ప్రైస్ షాప్ ఫెడరేషన్ నిర్వహించిన దర్నాలో పాల్గొన్న ప్రహ్లాద్ మోదీ(ఈ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు) తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ధర్నాలో దిగిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బీజేపీ గెలుపుకోసం మీరు ఆరోజు కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ కట్టబెట్టారని, కానీ, నేడు మళ్లీ ఇక్కడ ధర్నాకు కూర్చున్నారంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైనట్లేనని అన్నారు. అయితే, తాను చేసేది తన సోదరుడు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాదని, సమస్యల విషయంలో తన గొంతును మాత్రమే వినిపిస్తున్నానని చెప్పారు.